టమాటో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. టమాటో ధర సైతం కొండెక్కింది. అక్కడినించి దిగనంటోంది. ధరలు మండిపోతుండటంతో కొనేదెట్టా అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో టమాటో 50 రూపాయల వరకు పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో టమాటో ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది.
ఇక ఆదివారం వచ్చిందంటే చాలు.. టమాటోల వినియోగం ఎక్కువగా ఉంటుంది. మాంసం ప్రియులు అయితే పెద్దగా వాడరు కానీ శాఖాహార ప్రియులు టమాటోలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో హోల్ సేల్ మార్కెట్లో కిలో 70 రూపాయలు పలుకుతుంటే.. చిల్లర వ్యాపారులు కిలో 80 నుంచి 100కి చేర్చారు. నాణ్యత కలిగిన టమాటోలు కిలో రూ.100 పలుకుతున్నాయి. అలాగే, చిత్తూరు జిల్లా రామకుప్పం మినీమార్కెట్ యార్డులో 15 కిలోల బాక్సు ధర గరిష్ఠంగా రూ.1150 , వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో రూ.1000 వరకు పలికింది.
అయితే, తమిళనాడు, కర్ణాటకలో మండుటెండలు, ఎడతెరపిలేని వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి కూడా టమాటోల దిగుబడి తగ్గడంతో బయటి నుంచి వచ్చే టమాటోలకు భారీగా ధర పలుకుతోంది.
టమాటోల ధర పెరగడంపై సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు రెండుమూడు కిలోలు కొనేవారు ఇప్పుడు అరకిలోకి పరిమితం అయ్యారు. కొందరైతే టమాటో కొనడం మానేశారు. నిమ్మకాయలు కూడా భారీగా ధర పలకడంతో వాటిని దూరంగా ఉంచుతున్నారు.