భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. గతంతో పోలిస్తే ఈ నెలలో పలు రాష్ట్రాల్లో నమోదు కావాల్సిన దాని కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనీసం మార్చి కూడా ప్రారంభం కాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధానంగా పంజాబ్‌లో గత వారంలో కనీసం ఒక రోజు సగటు గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా మార్చి మధ్యలో కనిపించే స్థాయికి చేరుకుంది. ఇక యూపీ, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఫిబ్రవరి చివరి వారాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు గత వారం నుంచే నమోదవుతున్నట్టు ఐఎండీ పేర్కొంది.
ఈ ఏడాది శీతాకాలంలో తగిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ముందస్తుగానే భానుడు మండిపోతున్నట్టు తెలిపింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రెండు వారాల్లో పలు రాష్ట్రాలపై ప్రభావం పడుతుందని వెల్లడించింది. ముఖ్యంగా ఇది గోధుమ పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పింది. ఐఎండీ డేటా ప్రకారం…
ఫిబ్రవరి 16 నాటికి దేశ సరాసరి ఉష్ణోగ్రతలు 27.52 డిగ్రీ సెల్సియస్ గా ఉంది. 1981-2010 మధ్య ఈ వారం నాటికి సరాసరి ఉష్ణోగ్రత కన్నా 0.39 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. 1951 తర్వాత ఇది 23వ అత్యధిక ఉష్ణోగ్రత. గతేడాది ఈ సమయానికి సరాసరి ఉష్ణోగ్రతలు 25.4 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇది 1951 తర్వాత 50వ అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం.
దేశంలోని కొన్ని ప్రాంతాలు ముందస్తుగానే వేసవి ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ముగిసే సమయానికి 1951 నుంచి చూస్తే మొదటి, రెండవ, మూడవ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, ఒడిశా మిజోరంలలో ఇది 10వ అత్యధిక ఉష్ణోగ్రతలుగా ఉన్నాయి. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో ఈ వారం ఉష్ణోగ్రతలను 1951 నుంచి చూస్తే 20 అత్యంత ఉష్ణోగ్రతలుగా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుండటంతో మార్చిలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.