ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టి యూపీపై ఉంది. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. మాటల యుద్ధం మాత్రం నాలుగు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మధ్య కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ, మాయావతి మధ్య అగ్గి రాజుకుంది.
రాష్ట్రమంతా ఎన్నికల కోలాహలం నెలకొని ఉంటే మాయవతి ఎలాంటి ప్రచార ఆర్బాటం లేకుండా ఎందుకు సైలెంట్ అయ్యారో అర్థం కావడంలేదని ప్రియాంక గాంధీ కామెంట్ చేశారు. ఆమె తీరు తనను ఆశ్యర్యానికి గురిచేస్తోందన్నారు. పోలింగ్ సమయం దగ్గరపడ్డా మాయావతి ఎందుకు అంటీముట్టనట్టు ఉంటున్నారోనని పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రియాంక వ్యాఖ్యలపై మాయావతి స్పందించారు. కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప కాంగ్రెస్ తో ఎలాంటి ప్రయోజనం లేదని చురకలంటించారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థి గంటల వ్యవధిలోనే తన విధానాన్ని మార్చుకుంటారని.. అలాంటప్పుడు ప్రజలు తమ ఓటును హస్తం పార్టీకి వేసి దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు.
నిజానికి ఈ విడత ఎన్నికల్లో మాయావతి పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ఆమె ఆలస్యంగా ప్రచారంలోకి దిగారు. అందుకే ప్రియాంక తనదైన రీతిలో విమర్శలు చేశారు. కానీ.. మాయావతి నుంచి అదే రీతిలో ఎదురుదాడి తప్పలేదు.