GHMC కొత్త కార్పొరేటర్లకు ఎట్టకేలకు అధికారిక ముద్రపడింది. నూతన పాలకవర్గం ఏర్పాటుకు మరో అడుగు ముందుకుపడింది. కొత్తగా ఎన్నికైన 150 వార్డుల కార్పొరేటర్ల పేర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించింది. దీంతో రానున్న 30 రోజుల్లో పాలకమండలి ఏర్పాటు ఖాయం కానుంది. ప్రసుత పాలకవర్గం గడువు వచ్చే నెల 10వ తేదీ వరకు మాత్రమే ఉంది. దీంతో ఫిబ్రవరి 11-15 తేదీల మధ్య గ్రేటర్ నూతన పాలకమండలి కొలువుదీరనుంది.
మరోవైపు మేయర్, ఉపమేయర్ ఎన్నికపై ఇంకా క్లారిటీ రాలేదు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాలు దక్కించుకోగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అధికార టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కావాల్సిన బలం లేదు. దీంతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వెళ్తుందా..? లేక మరోదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించబోతోందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.