బీఆర్ఎస్ పాలనలో కబ్జాలకు కొదవేం లేదు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా అందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరైతే కేసులతో ముప్పుతిప్పలు పడుతున్నారు. తాజాగా ఆ లిస్టులోకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరిపోయారు.
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం భూవివాదంలో విజయలక్ష్మి, ఆమె తమ్ముడు వెంకటేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిర్జాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 20లో 10 ఎవరాల భూమి ఉంది. ఇప్పుడా భూమి మేయర్ చేతుల్లోకి వెళ్తోందని బాధితులు వాపోతున్నారు. ఆమె దగ్గరుండి మరీ.. ఫెన్సింగ్ వేయించారని మండిపడుతున్నారు.
తమ భూమి ఫెన్సింగ్ తొలగించి గన్ తో బెదిరించి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2007లో ఈ భూ వివాదంలోనే ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి హత్య జరిగింది. ఇప్పుడు తమను కూడా చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని భాధితులు అంటున్నారు. న్యాయం చేయాలంటూ మీడియాను అశ్రయించారు. పోలీసుల ప్రొటెక్షన్ తో భూమి చదును చేసి మేయర్ విజయలక్ష్మి, ఆమె తమ్మడు వేంకటేశ్వరరావు ఫెన్సింగ్ వేయించారని వాపోయారు.
విజయలక్ష్మి తీరుపై బాధితులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న మేయర్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.