తూర్పు ఉక్రెయిన్ లోని డొనెట్స్‌క్‌పై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. మారియుపోల్‌లోని స్టీల్ ప్లాంట్ చుట్టూ వైమానిక దాడులు కొనసాగాయి. పలు పట్టణాలలోని పౌర మౌలిక సదుపాయాలపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్ చుట్టూ రష్యన్ దళాలు తమను నిరోధించే యత్నాల్లో ఉన్నాయని ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రష్యాకు మరో షాక్ తగిలింది. ఉక్రెయిన్ పై జరుగుతున్న అమానుష దాడులను నిరసిస్తూ అమెరికా దిగ్గజ కంపెనీ మెక్‌డోనాల్డ్స్.. రష్యాలో షెట్టర్ క్లోజ్ చేసింది.
రష్యాలోని తమ వ్యాపారాలను అమ్మేస్తున్నట్టు ప్రకటించింది. రష్యా వ్యాప్తంగా ఉన్న 850 రెస్టారెంట్ల అమ్మకాల ప్రక్రియను ప్రారంభించింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన తర్వాత మాస్కో నుంచి వైదొలుగుతోన్న మరో అతిపెద్ద వెస్ట్రన్ కార్పొరేషన్ కావడం గమనార్హం. రష్యాలో వ్యాపారాలు నిర్వహించడమనేది ఆమోద యోగ్యం కాదని.. మెక్‌డొనాల్డ్స్ విలువలకు ఇది అనుగుణంగా లేదని కంపెనీ భావిస్తోంది. చికాగోకు చెందిన ఈ కంపెనీ మార్చి ప్రారంభంలోనే రష్యాలో స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు వెల్లడించింది.
అప్పటి నుంచి ఆ స్టోర్లలో పనిచేసిన ఉద్యోగులకు జీతాలు ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ వర్కర్లను నియమించుకునే రష్యన్ కొనుగోలుదారు కోసం చూస్తున్నట్టు మెక్‌డొనాల్డ్స్ ప్రకటించింది. ఈ అమ్మకపు ప్రక్రియ ముగిసే వరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు. మెక్‌డొనాల్డ్స్‌లో అంకితభావంతో పనిచేసే 62 వేల మంది ఉద్యోగులకు, రష్యన్ సప్లయిర్స్ తాము వైదొలగడం నిజంగా కష్టతరమైన విషయమని కంపెనీ చెప్పింది. కానీ.. వ్యాపారాలు కొనసాగించడం మాత్రం కంపెనీ విలువలకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
కంపెనీ విలువలకే తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. మూడు దశాబ్దాల క్రితం మాస్కో మధ్యలో మెక్‌డొనాల్డ్స్ తొలి స్టోర్‌ను ఏర్పాటు చేసింది. సోవియట్ యూనియన్‌లో తెరిచిన తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్సే. బ్రిటీష్ ఎనర్జీ దిగ్గజాలు షెల్, బీపీ నుంచి ఫ్రెంచ్ కారు తయారీదారి రెనాల్ట్ వరకు రష్యా నుంచి వైదొలిగాయి. అయితే మెక్‌డొనాల్డ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా వందకి పైగా దేశాలలో 39 వేల ప్రాంతాలలో రెస్టారెంట్లు ఉన్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షలతో మెక్‌డొనాల్డ్స్‌తో పాటు ఇతర అమెరికన్ ఫుడ్, బెవరేజ్ దిగ్గజాలు కోకా కోలా, పెప్సి, స్టార్ బక్స్ వంటివి కూడా రష్యాలో కార్యకలాపాలను మూసివేస్తున్నాయి.