రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై రెజ్లర్లు తమ పోరును ఉధృతం చేశారు.. ఈ సంస్థ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పైన, కోచ్ లపైనా ‘మీ టూ ఉద్యమాన్ని’ వారు ప్రారంభించారు. రెండో రోజైన గురువారం కూడా వీరంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చున్నారు. సుమారు 200 మంది అథ్లెట్లు కూడా వీరికి సంఘీభావం ప్రకటిస్తూ వీరి ధర్నాలో పాల్గొంటున్నారు.
మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు, అవమానాలకు గురి చేస్తున్నాడని వినేష్ ఫొగట్, మరికొంతమంది చేసిన ఆరోపణలపై 72 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని క్రీడా మంత్రిత్వ శాఖ… రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఆదేశించినా.. భూషణ్ పై తీవ్రమైన చర్య తీసుకోవలసిందేనని వీరు డిమాండ్ చేస్తున్నారు. వినేష్ ఫొగట్ కజిన్, బీజేపీ సభ్యురాలు, మాజీ రెజ్లర్ అయిన బబితా ఫొగట్ కూడా గురువారం వీరితో కలిసి ప్రొటెస్ట్ చేశారు. ప్రతి స్థాయిలో తాను ప్రభుత్వంతో పోరాడుతానని, రెజ్లర్లకు పూర్తి న్యాయం జరిగేవరకూ విశ్రమించబోనని ఆమె అన్నారు.
వీరి నిరసనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్.. స్వాతి మలివాల్.. క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కూచున్నవారిని కూడా ఆమె పరామర్శించారు. 2018 లో బాలీవుడ్, టాలీవుడ్ లలో ప్రారంభమైన మీ టూ ఉద్యమం ఆ తరువాత కొన్ని ఇతర రంగాలకు కూడా వ్యాపించింది. జూనియర్ల పట్ల సీనియర్ల లైంగిక వేధింపులను నాడు బాధిత మహిళలు హైలైట్ చేశారు.
ఢిల్లీలో నిన్న నిరసన చేసినవారిలో బజ్ రంగ్ పునియా, వినేష్, సాక్షి మాలిక్ సహా మరికొందరు రాత్రి చాంద్ నీ చౌక్ లోని ఓ ఆలయంలోనే ఉన్నారని, తమ భవిష్యత్ ఆందోళనపై చర్చించారని, గుడిలో ఇచ్చిన ప్రసాదాన్నే ఈ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తిన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.