రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ పరిణామం పలు సంక్షోభాలకు దారి తీస్తోంది. ఇప్పటికే అనేక మంది విదేశీయులు వార్ జోన్ లలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశాలకు పంపేందుకు ప్రభుత్వాలు సైతం చర్యలు చేపడుతున్నాయి. ఇంకా చాలా మంది అక్కడే చిక్కుకున్నట్టు సమాచారం. అయితే.. విదేశీయుల తరలింపు విషయంలో ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్పందించింది. భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్ లోని పరిస్థితులపై మాట్లాడారు.
ఉక్రెయిన్ లోని భారతీయులతో పాటు.. అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని డిమాండ్ చేశారు. రష్యా, ఉక్రెయిన్ లకు విన్నవించుకున్నప్పటికీ సుమీలో చిక్కుకున్న తమ విద్యార్థులను తరలించేందుకు సురక్షిత కారిడార్ ఏర్పాటు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి 20,000 మంది భారత పౌరులు సురక్షితంగా స్వదేశం చేరేందుకు సదుపాయాలు కల్పించగలిగామని అన్నారు.
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 1.5 మిలియన్ల మంది ఉక్రెయిన్ ప్రజలు సరిహద్దు దేశాలకు వలస వెళ్లారని పేర్కొన్నారు. ఓ భారతీయ విద్యార్థితో పాటు.. 140 మంది మృతి చెందారని వెల్లడించారు. యువకుడి మృతికి యావత్ భారత్ కన్నీరు పెట్టుకుందన్నారు. ఉక్రెయిన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయన్నారు. తటస్థ, స్వతంత్రత, నిష్పాక్షికత అనే నియమాలపై ఆధారపడి మానవతా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
దాడులకు తక్షణమే ముగింపు పలకాలని భారత్ నిరంతరంగా కోరుతోందన్నారు తిరుమూర్తి. ఇరు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోఢీ మాట్లాడి.. తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చారని తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం 80 విమానాలకుపైగా నడిపినట్లు వెల్లడించారు. అందుకోసం సహకరించిన ఉక్రెయిన్, సరిహద్దు దేశాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇప్పటికే ఉక్రెయిన్, దాని సరిహద్దు దేశాలకు ఔషధాలు, టెంట్లు, నీటి నిలువ ట్యాంకులు వంటి సామగ్రిని మానవతా సాయం కింద అందించినట్లు చెప్పారు.