‘మక్కా’ తీర్పులో న్యూ టర్న్, జడ్జి రవీందర్ రిజైన్

మక్కామసీదు పేలుళ్ల కేసులో సోమవారం సంచలన తీర్పు ఇచ్చిన ఎన్ఐఏ కోర్టు జడ్జి రవీందర్‌రెడ్డి, అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తనను వెంటనే రిలీవ్ చేయాలని, లేనిపక్షంలో 15 రోజుల సెలవు మంజూరు చేయాలని అందులో ప్రస్తావించారు. సోమవారం ఉదయం మక్కామసీదు కేసులో ఐదుగురు నిందితులైన అసీమానందతోపాటు భరత్‌, దేవేందర్‌ గుప్తా, రాజేందర్‌, లోకేశ్‌ శర్మను నిర్దోషులుగా ప్రకటించారు జడ్జి రవీందర్‌రెడ్డి.

ఈ నేపథ్యంలో తీర్పుపై చర్చ కొనసాగుతున్న తరుణంలో జడ్జి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. రవీందర్‌రెడ్డి నాంపల్లి కోర్టు నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా కొనసాగుతూనే, ఎన్ఐఏ కోర్టు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలావుంటే రవీందర్‌‌రెడ్డి రిజిగ్నేషన్‌పై న్యాయవాద సంఘాల్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తప్పుకున్నట్లు ప్రధానంగా చెబుతున్నారు. కానీ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా పేలుళ్ల కేసులో తీర్పు వెలువడిన వెంటనే జడ్జి విధుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లు వుండవచ్చన్న మాట కూడా వినిస్తోంది. 2007 మే 18న మక్కా మసీదులో టిఫిన్ బాంబు పేలుడు ధాటికి 9 మంది చనిపోగా, 50 మంది గాయపడ్డారు. అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించిన విషయం తెల్సిందే!


తాను ఓ సాధువుగా చెప్పుకునే అసీమానంద మక్కా మసీదు కేసులో ఆయన్ని 2010లో అరెస్ట్ చేసింది సీబీఐ. అసీమానంద అసలు పేరు నబాకుమార్ సర్కారు. ఆయన స్వస్థలం పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ. బోటనీలో ఆయన పీజీ చేశారు. 1977లో బెంగాల్లోని బీర్భూమ్, బంకూర, పురులియా జిల్లాల్లో ‘ఆదివాసీ కల్యాణ్ ఆశ్రమ్’ ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో వేరే మతంలోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి రప్పించడానికి ఆయన కృషి చేశారు. తన అనుచరులతో కలిసి శబరి ధామ్ ఆశ్రమాన్ని కూడా నడిపారు. వీరిలో చాలామందిని సీబీఐ ప్రశ్నించింది.