బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై వస్తున్న భూకబ్జా ఆరోపణలు నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో 70.33 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేసినట్లు తేలిందన్నారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములను జమునా హ్యాచరీస్ కబ్జా చేసినట్లు బయటపడినట్లు వివరించారు కలెక్టర్.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన ఎమ్మెల్యే పదవికి, ఆరోగ్య మంత్రిత్వశాఖకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తరువాత హుజూరాబాద్ లో వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పై భారీ మెజార్టీతో గెలిచారు.