బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమ భూములు తమకు అప్పగించాలని కోరుతూ కొందరు శుక్రవారం మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు.
దళిత, మాల మహానాడు, రజక సంఘం అధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. హకీంపేట, అచ్చంపల్లి గ్రామ శివారులో ఈటల రాజేందర్ కు చెందిన జమునా హ్యాచరీస్ కు సంబంధించిన భూముల విషయంలో వీరు నిరసనకు దిగారు.
గతేడాదిగా సాగుతున్న ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. అయితే.. ప్రభుత్వం ఇప్పటికే సర్వే కూడా నిర్వహించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.కబ్జాకు గురైన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలంటూ రజక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి కూడా యత్నించారు. వారం పది రోజుల్లో భూములు అందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరసనకారులను అదనపు కలెక్టర్ ఛాంబర్ లోకి రప్పించుకుని వినతి పత్రం తీసుకున్నారు. భూముల సర్వే పూర్తయిందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.