ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర సందడి మొదలైంది. మండే మెలిగే పండుగగా పిలిచే మినీ జాతర ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సమ్మక్క, సారలమ్మ పూజారులు డోలు వాయిద్యాలతో పసుపు, కుంకుమ పువ్వులు పండ్లతో సమ్మక్క గుడికి చేరుకొని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు.
జాతర ప్రారంభం రోజున ఆచారం ప్రకారం మేడారం గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా పూజారులందరూ డోలి వాయిద్యాలతో బయలు దేరి తోరణాలు కట్టారు. బెల్లం పానకం, కల్లు, నీరు ఆరబోసి మండమెలిగే పండుగ జరుపుకున్నారు.
సారలమ్మ దేవాలయంలో పూజారులు ఆలయాన్ని శుద్ధి చేసి అందులో ఉన్న వస్తువులకు పసుపు, కుంకుమలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. మరోవైపు మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి.
మొదటి రోజే జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.