బిత్తిరి సత్తిని టీవీ9 లోకి తీసుకోవడం వెనుక మర్మమేమిటి? మేధావుల్లో, మీడియా వర్గాల్లో సర్వత్రా చర్చ.
(విద్యావెంకట్, జర్నలిస్ట్)
ఏది చీకటి? ఏది వెలుతురు? ఏది జీవితం? ఏది మృత్యువు? ఏది పాపం? ఏది పుణ్యం? ఏది సత్యం? ఏది అసత్యం? ఏది కారణం? ఏది కార్యం? అన్నమహాకవి శ్రీశ్రీ అర్ధాలు గుర్తుకు వస్తున్నాయి. మీడియాలో రాజకీయ జోక్యంతో విలువలు గల జర్నలిజం అదుపు తప్పుతుంది. వడ్డించేవాడే మన వాడయితే ఏమూలన కూర్చున్నా ఫరవాలేదు అన్న విధంగా తయారైంది. మెరుగైన సమాజం కోసం విజనరీ జర్నలిస్ట్ రవిప్రకాశ్ సృష్టించిన టీవీ9ను అధికార పార్టీ అండతో బడా కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. టీవీ9 సమాజంలో నెలకొన్న అసమానతలపై యుద్ధం ప్రకటించడంతో కోట్లాది మంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగులో ప్రారంభమైన టీవీ9 ఉత్తరాదిన ఇతర భాషల్లో సైతం ప్రారంభమై తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించింది. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నీటి ప్రాజెక్టుల్లో వేలాది కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్లు టీవీ9 ద్వారా అధికార పార్టీకి కొమ్ము కాయాలని నిర్ణయించుకున్నారు. టీవీ9కు సీఈవోగా రవిప్రకాశ్ ఉంటే తమ పప్పులుడకవని భావించి అతన్ని తప్పించారు. రవిప్రకాష్‌పై అక్రమ కేసులు బనాయించారనే విమర్శలు వచ్చాయి. రవిప్రకాశ్ లేని టీవీ9 కేవలం కొద్ది నెలల్లోనే పస తగ్గింది. ఈ విధంగా కొనసాగితే టీవీ9 రేటింగ్ తగ్గుతుందనే భయంతో ఏమిచేయాలో అర్ధం కాక కొత్త యాజమాన్యం ఇతర చానెల్‌లో పనిచేస్తున్న వారిపై దృష్టిసారించింది. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ యజమాని అయిన వీ6 ను వీక్ చేస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలిన విధంగా చేయవచ్చనే దుర్భుద్ధితో వీ6లో పనిచేస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్‌ను టీవీ9లోకి తీసుకుని అప్పాయింట్‌మెంట్ ఆర్డర్‌ను ఇచ్చారు. అధికార పార్టీని తరచూ విమర్శిస్తున్న వివేక్ యజమానిగా ఉన్న వీ6 చానెల్‌ను వీక్ చేయడం ద్వారా అధికార పార్టీ మెప్పు పొందవచ్చని కొత్త యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణ జూనియర్ ఆర్టిస్ట్‌ను వీ6లో సీఈవో అంకం రవి ‘బిత్తిరి సత్తి’ గా ఒక క్యారెక్టర్‌ను తయారు చేసి ప్రేక్షకులకు అందించారు. బిత్తిరి సత్తి కేరెక్టర్ (తీన్ మార్ వార్తలు) ప్రోగ్రాం ఆ బులిటెన్ ప్రేక్షకులకు చేరువై వారి మనసును గెలుచుకుని తెలంగాణా రాష్ట్రంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. వీ6 నుంచి టీవీ9లో చేరిన బిత్తిరి సత్తికి రాబోయే రోజుల్లో అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జర్నలిజం అంటే విలువైన జర్నలిజం, నీతి నిజాయితీ, ధర్మబద్దంగా విలువైన వార్తలు అందించి సమాజ అభివృద్ధికి కృషి చేసేవారు. ఎలక్ట్రానిక్ మీడియా (24 గంటల వార్తలు) వచ్చాక న్యూస్ ప్రేజెంటర్స్, కేరెక్టర్ ఆర్టిస్టులకు గిరాకీ పెరిగి సెలబ్రిటీలుగా మారారు. అయితే వారిని కూడా తయారు చేసేది జర్నలిస్టులే అనే విషయం మరువకూడదు. ఒకే ఒక అవకాశం కల్పించాలని, జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేస్తామని హామీలిచ్చి సెలబ్రిటీలు అయ్యాక తామే గొప్పవాళ్ళమని వ్యవహరించడంతో జర్నలిజం విలువలు మంట గలుస్తున్నాయి. ఏమైనా రాజకీయ పార్టీల ఆధిపత్యంతో, పెట్టుబడిదారుల కబంధ హస్తాలలో మీడియా విలవిలలాడడం సమాజానికి చేటు. పరిస్థితి ఈ విధంగా కొనసాగితే సోషల్ మీడియాకు మీరే చేజేతులా ఆస్కారం ఇచ్చేవాళ్లు అవుతారు.
(ఈ ఆర్టికల్‌లో కాలమిస్టు వ్యక్తంచేసిన అభిప్రాయాలు అతని వ్యక్తిగతమైనవి. ఇందులో ‘తొలివెలుగు’కు కానీ, అందులో పనిచేసే ఎడిటోెరియల్ సిబ్బందికి కానీ ఎటువంటి బాధ్యత లేదు)