నర్సింహ రెడ్డి, జర్నలిస్ట్
కరోనా తీవ్రత మీడియాను రోగగ్రస్తం చేసింది. తెలుగు మీడియా పరిస్థితి ఏమిటో ఒక సారి చూద్దాం..
దినపత్రికలు.
ప్రతి సంవత్సరం 150 కోట్ల లాభాలను అధినేత రామోజీరావుకు అందజేసిన ఈనాడు నష్టాల్లో మునిగింది. 18 లక్షల సర్క్యులేషన్ 6 లక్షలకు పడిపోయింది. ఈ 6 లక్షల కాపీలతో నెలకు 25 కోట్ల నష్టం. మరో పక్క ఫిలింసిటీ లో షూటింగ్ లు ఆగిపోయి టూరిస్టులు రాక మరోనష్టం. దీంతో ఉద్యోగులకు కత్తెర తప్పదని యాజమాన్యం చెప్తుంది. కరోనా తగ్గిన తరువాత కూడా న్యూస్ పేపర్ కొని చదివే అలవాటు పోతుంది కాబట్టి తెలుగు దినపత్రిక ఈనాడు పరిమితంగా ప్రజలకు అందుతుంది.
ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక సర్క్యులేషన్ ను బాగా తగ్గించుకుంది. ఎన్ని కాపీలు ముద్రిస్తే అంత నష్టం మరి. ఇక్కడ జర్నలిస్ట్ లు కూడా ఎప్పుడు వేటు పడుతుందో అని భయపడుతున్నారు.
కరోనా వ్యాధి సమయంలో ఫైవ్ స్టార్ క్వారంటైన్ ను ఎంజాయ్ చేస్తున్న దిన పత్రికలు సాక్షి, నమస్తే తెలంగాణ. సర్కూలేషన్ ను బాగా తగ్గించుకున్నప్పటికి ఆర్థిక వనరులకేం కొదవ లేదు. ప్రజాధనాన్ని , అడ్వర్టైజ్మెంట్ ల రూపంలో మింగుతున్న ఈ రెండు దినపత్రికలు భజన పరుల వేదికగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. ఇన్ని కోట్ల ప్రజాధనాన్ని మిడియాలోకి మళ్లించడం ప్రజాస్వామ్యం కాకపోయినా ఇది నడుస్తున్న చరిత్ర. సాక్షి దినపత్రికకు నెలకు 10 కోట్ల ప్రజాధనం మళ్లిస్తున్నారని ఆ పత్రిక ఉద్యోగి నాతో వాపోయారు.
టీవి మీడియా
పత్రికలు పెట్టుబడికి, కట్టుక థకు పుట్టిన విషపత్రికలు అని ఒక పెద్దమనిషి గతం లో అన్నారు. న్యూస్ టెలివిజన్ నేనేమాత్రం తీసిపోను అని నిరూపించింది. అన్ని టీవీ చానల్స్ తమకు భజన చేయడం చూసి పాలకులకు, పెట్టుబడి దారులకు వెగటు పుట్టింది. కొన్ని చానల్స్ ను మూస్తే పోలా అని వాళ్ళు భావించారు. ఆ మధ్య ఓ పెద్దాయన మీటింగ్ పెట్టి తాను టెలివిజన్ రంగం లోకి వచ్చిన కారణాలను వివరించారు. 80 వేల కోట్ల ఆస్తులను ఏంచేసుకోవాలో తెలియడం లేదని, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకుండా మీడియాను కొంటానని చెప్పారు. అయితే కొన్ని నెలల్లోనే ఖర్చు ఎక్కువ అని చెప్పి 250 మంది జర్నలిస్ట్ లను ఉద్యోగాలు పీకి రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు మరో ఛానల్ మూసెయ్యడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. లెక్కలేనంత డబ్బు ఉందని ప్రగల్భాలు పలికిన న్యూస్ టెలివిజన్ ఓనర్లు కరోనా సాకుతో జర్నలిస్టుల పొట్టమీద కొట్టడానికి సిద్ధం అవుతున్నారు.
కరోనా వల్ల వచ్చిన రెండు నెలల నష్టానికీ విలవిలాడుతున్న యజమానులు ఇప్పటిదాకా మీడియాను అడ్డం పెట్టుకొని సంపాదించిన వేలు, వందల కోట్లు ఎక్కడ దాచారు? ఇప్పటి దాకా తమ చెమటను ధారపోసిన జర్నలిస్ట్ లను వేస్ట్ పేపర్లు గా ఎందుకు మారుస్తున్నారు?
నేను నెపం జర్నలిస్ట్ లమీదే వేస్తాను. అవును వాళ్లే ఈ పరిస్థితికి కారణం. వెన్నెముక లేని వాళ్ళను, లక్ష, రెండు లక్షల జీతానికి మొత్తం సంక్షేమాన్ని తాకట్టు పెట్టేవారిని జర్నలిస్ట్ నాయకులుగా ఎన్నుకోవడమే మనం చేసిన తప్పు. ఈ నీచులను, పాలకుల బూట్లు నాకే గూట్లే గాళ్లను నాయకులను చేయడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం.నా యువ జర్నలిస్ట్ మిత్రుల నుంచి ఆత్మను అమ్ముకోని నాయకత్వం పుడుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. కొత్త నాయకత్వంలో మీడియా ప్రజల పక్షాన నిలుస్తుందని పాలకుల్ని, పెట్టుబడి విషనాగుల్ని ఎదిరిస్తుందని నా నమ్మకం.