మాది రైతు రాజ్యమని కేసీఆర్ సర్కార్ ఘనంగా చెప్పుకుంటుంటే, మార్కెట్లో తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్ముకోడానికి వచ్చిన రైతులపై దళారులు దాడిచేసి వెళ్లగొట్టారు. ఈ ఘటన ఎక్కడో తెలంగాణ మారుమూల ప్రాంతంలో జరిగినది కాదు, రాజధాని నడిబొడ్డున జరిగింది.
బొప్పాయి రైతులపై దళారులు దాడికి పాల్పడటంతో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. పండ్లను తమకు అమ్మకుండా నేరుగా రైతులు మార్కెట్‌కు తరలించడంపై ఆగ్రహించిన దళారులు రైతులపై దాడికి దిగారు. రైతులు వారికి ఎదురు నిలిచారు. బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు డిమాండ్ చేశారు. దళారులు చెబుతున్న ధర అయితే తమకు గిట్టుబాటు కాదని రైతులే నేరుగా విక్రయాలు జరిపారు. ఇదే ఘర్షణకు కారణమైంది. సిటీలో ఎక్కడ చూసినా విష జ్వరాలు వ్యాప్తింస్తుండటంతో నగరంలో పండ్ల విక్రయాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ రాకుండా బొప్పాయి మంచి పోషక విలువలతో కూడిన రోగ నిరోధక శక్తి ఇస్తుందని చెబుతుండటంతో అందరూ వాటిని విరివిగా వాడుతున్నారు. దాంతో బొప్పాయి పండ్ల విక్రయాలు బాగా పెరిగాయి. కిలో బొప్పాయి నాణ్యతను బట్టి 150 రూపాయిల వరకు పలుకుతోంది.