నిబంధనలు ఉల్లంఘించి కరోనా వైరస్ పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఓ డాక్టర్ కు మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నోటీసు లిచ్చింది. సెంట్రల్ ముంబై లోని దాదర్ కు చెందిన డాక్టర్ అనిల్ పాటిల్ చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ గురించి ఆందోళన అవసరం లేదని…దాని గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు…భారతదేశంలోని వేసవికాలంలో అది బతకదని పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వైరస్ గురించి అంత తక్కువ చేసి మాట్లాడడానికి ఏమైనా అధ్యయనం చేశారా..? లేక ఏదైనా డేటాబేస్ ఉందా..? అని మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ డాక్టర్ అనిల్ పాటిల్ ను వివరణ కోరింది.
నోవెల్ కరోనా వైరస్ గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అడ్వైజరీని కాదని..డాక్టర్ అనిల్ పాటిల్ ఆ విధంగా మాట్లాడడం సరికాదు…ఆయన పలుమార్లు ఆ వైరస్ తీవ్రతను తక్కువ చేసి మాట్లాడారు…దాని గురించి అతన్ని వివరణ కోరామని మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ్ కుమార్ ఉత్తేకర్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అడ్వైజరీని పలు మార్లు ఉల్లంఘించినట్టు ఆధారాలున్నాయని అన్నారు.
2002లో చైనాలో వచ్చిన సార్స్ వైరస్ ఇండియాలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని..మాస్క్ ల తయారీదారులు కరోనా వైరస్ గురించి పెద్దగా ప్రచారం చేస్తున్నారంటూ డాక్టర్ అనిల్ పాటిల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహించేందుకు ప్రోత్సహిస్తున్నందున నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని మెడికల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ్ కుమార్ ఉత్తేకర్ తెలిపారు. మహారాష్ట్రలో మొత్తం 39 మంది కరోనా పేషెంట్లు నమోదు కాగా వారిలో బుధవారం ఒకరు చనిపోయారు.