వైద్యరంగంలో మెరుగైన ఫలితాలు సాధించటంలో త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగపడుతుందని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో వైద్య పరికరాలు, ఇంప్లాంట్ ల త్రీడీ ప్రింటింగ్ పై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్రీడీ ప్రింటింగ్ తో వైద్యసేవలు మరింత మెరుగుపర్చవచ్చని అభిప్రాయపడ్డారు మంత్రి.
యూఎస్, యురోపియన్ మార్కెట్లలో ఇప్పటికే ఈ సాంకేతికత దూసుకుపోతోందన్నారు. భారత్ లోనూ అభివృద్ధికి చక్కటి అవకాశముందని వెల్లడించారు. ఉస్మానియాలో ఏర్పాటుకాబోతున్న నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మ్యాన్యుఫ్యాక్షరింగ్ సెంటర్ తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నవ్య సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంలో భాగంగా త్రీడీ ప్రింటింగ్ పై దృష్టిసారించామని వెల్లడించారు.
ఈ త్రీడీ ప్రింటింగ్ ద్వారా సర్జన్లు, రోగులకు వైద్యసేవలను మరింత మెరుగుపర్చే అవకాశం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఆర్థికంగా హెల్త్‌కేర్ త్రీడీ ప్రింటింగ్ మార్కెట్ విలువ 2020లో 1.7 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపారు. 2027 కల్లా ఇది 7.1 బిలియన్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణం.. ఆర్థోపెడిక్, డెంటల్ తో పాటు.. పలు విభాగాల రోగుల్లో ఇంప్లాంట్లకు డిమాండ్ పెరగడమేనని అభిప్రాయపడ్డారు కేటీఆర్.
ఈ రంగంలో కీలక సంస్థలను ఎన్‌సీఏఎమ్ గుర్తించే ఈ సదస్సు మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్‌సీఏఎమ్ ఉస్మానియా క్యాంపస్ కు రావడం గర్వకారణమని అన్నారు మంత్రి. సదస్సులో త్రీడీ ప్రింటింగ్ వృద్ధికి సంబంధించి పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు మంత్రి. ఈ మేరకు ప్రభుత్వం, ఉస్మానియా వర్శిటీల మధ్య ఒప్పందం కుదిరినట్టు వివరించారు మంత్రి.