నిమ్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ప్రీతి పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఇంకోవైపు పోలీస్ భద్రత పెంచారు. దీంతో ఏం జరగనుందా? అనే టెన్షన్ అంతా నెలకొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రీతి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారని తెలిపారు. ఇది ముమ్మాటికీ హత్యేనని అన్నారు.
ర్యాగింగ్ ఇష్యూను హెచ్ఓడీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న ఆయన.. ప్రీతి జోలికి సైఫ్ రాకుండా ఆపలేకపోయారని ఆరోపించారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులు ఏ ట్రీట్ మెంట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అడ్మిట్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా ఒకే రకంగా ఆరోగ్య పరిస్థితి ఉందని తెలిపారు. ‘‘నిన్నటి వరకు కొంత ఆశ ఉండేది.. బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెబుతున్నారు. ఆశలు వదిలేసుకున్నాం’’ అని అన్నారు ప్రీతి తండ్రి.
ప్రీతి బతికొస్తుందని ఏమాత్రం ఆశలు లేవని చెప్పారు. శరీర రంగు మారుతోందని.. మొదటి రోజుతో పోల్చితే చాలా క్షీణించిందన్నారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటు ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించిందని డాక్టర్లు హెల్త్ బులిటెన్ లో తెలిపారు.
వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.