ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే చదువును పూర్తి చేసింది. లక్షలు పెడితే కానీ లభించని మెడికల్ సీటు.. ఆమె కృషి, పట్టుదలకు ఇట్టే వరించింది. కానీ తన కుటుంబానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా మెడికల్ సీటు వచ్చినా.. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఎవరైనా దాతలు ఉంటే తన చదువుకు ఆపన్న హస్తం అందిస్తారని ఎదురు చూపులు చూస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిరిపెల్లి హెచ్ గ్రామానికి చెందిన గాడేకర్ అమ్రాజీ, జయశీల కుమార్తె సంకీర్తన. తల్లి వికలాంగురాలు. తండ్రి వ్యవసాయ కూలీగా పని చేస్తూ, పిండి గిర్నీ నడుపుతుంటాడు.
అలాగే కష్టాలతో చదువును కొనసాగించింది సంకీర్తన. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో ర్యాంకు సాధించింది, మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ లో సీటు సంపాదించింది. సంకీర్తనకు మాత్రం ఒక్క పక్క సంతోషం.. మరోవైపు ఆందోళన.
5వ తరగతి నుండి పదవ తరగతి వరకు టీఎస్ డబ్ల్యూఆర్ జేసీ లెఫ్ట్ పోచంపాడులో, ఇంటర్ విద్య ఆదిలాబాద్ లోని టీఎస్ డబ్ల్యూఆర్ జేఎస్ లో సంకీర్తన చదివింది. తన కూతురు చదువు కొనసాగింపునకు దాతలెవరైనా ముందుకు రావాలని కుటుంబ పెద్దలు వేడుకుంటున్నారు.