ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా దాని భారం చివరికి సామాన్యుడిపైనే పడుతోంది. రష్యా-ఉక్రెయిన్ ల యుద్ద ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండియాలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ , వంట నూనెల ధరలు పెరగడంతో.. సామాన్యుని వెన్నులో వణుకుపుడుతుంటే.. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు పెరగనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడినట్టైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కాలంలో మెడిసిన్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్క డోలో-650 రకం టాబ్లెట్స్ 350 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు డోలో, పారాసెటమాల్ తో సహా దాదాపు 809 రకాలకు పైగా మందుల ధరలు పెరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా భయంతో జ్వరం, జలుబు, తలనొప్పి ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు మెడికల్ షాప్ వైపుకు పరుగులు పెడుతున్నారు. సెకండ్, థర్డ్ వేవ్ సమయంలో ఇది మరింత అధికమయ్యింది.
కాగా.. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ సహా బీపీ తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 850 రకాల మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయని ప్రకటించింది. జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండెజబ్బులు, బీపీ, రక్తహీనత తదితరాల చికిత్సలో వినియోగించే పారాసిటమాల్, అజిత్రోమైసిన్, , మెట్రోనిడాజోల్ వంటి మందులకు భారీగా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.
అయితే.. ధరల సూచీలో మార్పుల కారణంగా కొన్నేళ్లుగా ఈ పెరుగుదల 1-2 శాతానికే పరిమితమైందని.. 2019లో ఔషధ కంపెనీలకు 2శాతం పెంపును అనుమతించగా.. 2020లో కేవలం 0.5 శాతం పెంచారని నేషనల్ ఫార్మా స్యూటికల్ అథారిటీ స్పష్టం చేసింది. మరోవైపు ఈ ధరల పెరుగులపై సామాన్య జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇంధన ధరలు, గ్యాస్ ధరలు, వంట నూనెలు ధరలు.. మరోవైపు ఈ మందుల ధరలు పెరుతుండడంతో జనరిక్ మందుల దుకాణాల సంఖ్య పెంచాలని సాధారణ మందులపై ధరలు పెంచవద్దని డిమాండ్ చేస్తున్నారు.