3 వారాల్లోనే రూ.600 కోట్ల ఔషధాల విక్రయం
అంతకుముందు రూ.70 కోట్ల అమ్మకాలు
8-15 రెట్లు పెరిగిన వినియోగం
95 శాతం మంది వరకు ఇంటి వద్దనే వైద్యం
ఒమిక్రాన్ దెబ్బకు ఔషధ విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ కు ముందు రూ.70 కోట్ల మేరకు కొవిడ్ మందుల అమ్మకాలు ఉన్నాయి. కానీ.. ఈ మూడువారాల్లో ఏకంగా 8-15 రెట్లు పెరిగాయి. సుమారు రూ.600 కోట్ల విలువ కలిగిన కొవిడ్ మందులను ప్రజలు వినియోగించారు. కరోనా బాధితుల్లో అత్యధికులు ఇంటి వద్దనే చికిత్స పొందుతుండటంతో.. బహిరంగ మార్కెట్ లో ఔషధ విక్రయాలు బాగా పెరిగినట్లుగా వైద్యవర్గాలు విశ్లేషించాయి. మందులు లభ్యం కావనే భావనతో ఎక్కువగా కొనుగోలు చేసి భద్రపర్చుకుంటున్నారని వ్యాపారులు చెప్తున్నారు.
వైద్యాఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. ఈ నెల 25 నాటికి రాష్ట్రంలో 34 వేల మంది కరోనాతో చికిత్స పొందారు. వారిలో 95 శాతం మంది ఒమిక్రాన్ బాధితులే కావడం గమనార్హం. వారిలో దాదాపు 95 శాతం మంది ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబంలో ఒకరిలో లక్షణాలు కనిపించగానే.. ఒకట్రెండు రోజుల్లోనే మిగిలిన సభ్యుల్లోనూ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో అందరూ కొవిడ్ ఔషధాలను వాడుతున్నారు. దీంతో ఔషధ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. చాలాచోట్ల పేరున్న ఔషధ ఉత్పత్తి సంస్థల్లో కూడా దగ్గు మందు అందుబాటులో ఉండడంలేదు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావ తీవ్రత అధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమవుతుండటం.. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా ఉండటం.. తదితర కారణాలతో వైద్యులు కూడా పరిమిత సంఖ్యలోనే ఔషధాలను సూచిస్తున్నారు. యాంటీబయాటిక్ ఔషధాల వాడకం ఈ దశలో అవసరం లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయినా వీటిని మాత్రం ఎక్కువమంది వాడుతూనే ఉన్నారు. అందువల్ల వాటి విక్రయాలు భారీగా పెరిగాయి.
ఇంటి వద్దనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. దీంతో మార్కెట్ లో దాదాపు అన్ని ఔషధ దుకాణాల్లోనూ స్వీయ నిర్ధారణ కొవిడ్ కిట్లు లభిస్తున్నాయి. ఎక్కువమంది వీటిని కొని సొంతంగా పరీక్షించుకుంటున్నారు. ఒక్కో కిట్ ఖరీదు సుమారు రూ.250 వరకు ఉంటుంది. వాటిని ఒక పెద్ద షాపుల్లో రోజుకు 500 కిట్ల వరకూ విక్రయిస్తున్నారు. అదే చిన్న షాపులో సుమారు 100 వరకూ విక్రయిస్తున్నారు. ఈ నెలలోనే సుమారు రూ.150 కోట్ల స్వీయ నిర్ధారణ కిట్లు అమ్మినట్లు ఔషధ వ్యాపార వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ లో నిమ్స్ సమీపంలో ఉన్న రెండు పెద్ద మెడికల్ షాపుల్లో సాధారణ రోజుల్లోనే రోజుకు రూ.50-60 వేల వరకూ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే.. గత 3 వారాలుగా కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో.. వీటిలో రోజుకు ప్రస్తుతం రూ.కోటి నుంచి కోటిన్నర వరకూ అమ్మకాలు సాగుతున్నాయి. అటు వరంగల్ లోని ఒక కాలనీలో ఉన్న మందుల దుకాణంలో సాధారణ రోజుల్లో.. రోజుకు సుమారు రూ.40 వేల వరకూ అమ్మకాలుంటాయి. అయితే.. ఇప్పుడు రోజుకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో మందుల వినియోగం ఎలా ఉందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.
డాక్సిసైక్లిన్, అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్ వంటి యాంటీ బయాటిక్ మెడిసిన్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇంకొంత మంది మోంటెలికాస్ట్, ఆంబ్రోక్సిల్, లెవోసెట్రిజిన్, ఎసెటైల్ సిస్టెయిన్ వంటి యాంటీ హిస్టామిన్ మందులను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వినియోగదారులు పారాసెటమాల్ లాంటి జ్వరం మాత్రలు, విటమిన్-డి, దగ్గు మందులు, పాంటాప్రొజోల్, రానిటడైన్ వంటి అసిడిటీ మాత్రలను ఉపయోగిస్తున్నారు.
రెండోదశలో గన్ థర్మామీటర్లు ఎక్కువగా కొనుగోలు చేశారు. కానీ.. ఇప్పుడు వాటిని ఎక్కువమంది కొనడం లేదు. ఫావిపిరవిర్ అమ్మకాలు కూడా తగ్గాయి. విటమిన్ మాత్రల్లో ఎక్కువగా విటమిన్-డి ఎక్కువగా కొంటున్నారు. మందుల కొనుగోలు శాతం పెరిగింది. కానీ.. మందుల ధరలు మాత్రం పెరగలేదు. డిమాండ్ కు సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉన్నాయి. అవసరాలకు మించి ముందస్తుగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదయని నిపుణులు చెప్తున్నారు.