సైకో సైఫ్ వేధింపులతో ఆస్పత్రి పాలయిన ప్రీతి కన్నుమూసింది. ఈ మేరకు నిమ్స్ డాక్టర్లు ప్రకటన చేశారు. సరిగ్గా రాత్రి 9.10 గంటలకు ఆమె చనిపోయినట్లు తెలిపారు. బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
ప్రీతి మరణాన్ని ముందుగానే అంచనా వేశారు తల్లిదండ్రులు. ఈ మేరకు వారికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు డాక్టర్లు. ప్రీతి బతికే అవకాశం లేదని ముందుగానే చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె తండ్రి నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతీది ముమ్మాటికీ హత్యేనని అన్నారు.
ర్యాగింగ్ ఇష్యూను హెచ్ఓడీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న ఆయన.. ప్రీతి జోలికి సైఫ్ రాకుండా ఆపలేకపోయారని ఆరోపించారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యుల ట్రీట్ మెంట్ పైనా అనుమానం వ్యక్తం చేశారు. అడ్మిట్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా ఒకే రకంగా ఆరోగ్య పరిస్థితి ఉందని వాపోయారు. నిన్నటి వరకు కొంత ఆశ ఉండేదని.. బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెప్పగానే ఆశలు వదిలేసుకున్నామని అన్నారు.
ప్రీతి తండ్రి వ్యాఖ్యల తర్వాత ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తును ఉంచారు. దీంతో ఆమె మరణించి ఉంటుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే 9.10 గంటలకు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.