గత కొంతకాలంగా మరుగున పడిన మీరా జాస్మిన్ తిరిగి తెరముందుకు రానుంది. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకున్న మీరా జాస్మిన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీకి రెడీ అయ్యింది. ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మీరా..ఆ తర్వాత బాలకృష్ణ, పవర్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చోటు దక్కించుకుంది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ కు ప్రాధాన్యమిచ్చిన మీరా జాస్మిన్ టాలీవుడ్ కు దూరమై దాదాపు దశాబ్దం అయిపోయింది. అయితే గత కొంత కాలంగా తన రీ-ఎంట్రీ గురించి హింట్స్ ఇస్తూ ఉంది.
గ్లామరస్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమారంగంలోని దర్శక నిర్మాతలకు తాను గ్లామర్ షోకూ రెడీ అని చెప్పకనే చెప్పింది. మొత్తానికి అమ్మడి పథకాలు ఫలించాయని తెలుస్తోంది.
ఇవాళ మీరా జాస్మిన్ 40వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె ‘విమానం’ అనే సినిమాతో రీ-ఎంట్రీ చేస్తున్నట్టు జీ స్టూడియోస్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ఆమె నాయికగా కె.కె. క్రియేటివ్ వర్క్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయబోతున్నట్టు తెలిపింది.
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన సమాచారం ప్రకటించాల్సి ఉంది. మాధవన్ ‘రన్’ మూవీతో తమిళంలోనూ మీరా జాస్మిన్ కు లక్షలాది అభిమానులు ఏర్పడ్డారు.
అదే సమయంలో ఇటు తెలుగులోనూ ‘గుడుంబా శంకర్, భద్ర’ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకుంది. నటిగా జాతీయ అవార్డునూ సొంతం చేసుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడీ ‘విమానం’తో ఎందరి హృదయాల్లోకి ల్యాండ్ అవుతుందో వేచి చూడాలి.