టర్కీ భూకంపంలో టన్నుల కొద్దీ శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు ఇండియా నుంచి డాగ్ స్క్వాడ్లతో వెళ్లిన సహాయక బృందాలు అహర్నిశం శ్రమిస్తున్నాయి. అక్కడి సైనిక బృందాలకు తోడుగా తమవంతు సాయాన్ని అందిస్తున్నాయి. సోమవారం సంభవించిన పెను భూకంప ధాటికి ఒక్క టర్కీలోనే 16 వేలమందికి పైగా మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు. అక్కడి ఓ ప్రావిన్స్ లో మూడు రోజులుగా శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆరేళ్ళ చిన్నారికి మన డాగ్స్ స్క్వాడ్ బృందం లోని ‘రోమియో’, ‘జూలీ’ అనే రెండు శునకాలు ప్రాణం పోశాయంటే నమ్మలేం.
నస్రీన్ అనే ఈ చిన్నారి తనను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తుండగా మొదటగా జూలీ ఆ శిథిలాల కింద ఈమె జాడను పసిగట్టి తన శిక్షకుడిని అలెర్ట్ చేసింది. ఆ వెంటనే ఆయన రోమియోను కూడా తీసుకుని ఆ ప్రదేశంలోని శిథిలాలను తొలగించారు. ఈ చిన్నారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసి మిలిటరీ హెలికాఫ్టర్ లో హటాయ్ ప్రావిన్స్ లోని భారతీయ ఆర్మీఆసుపత్రికి తరలించారు.
నస్రీన్ కి ప్రమాదమేమీ లేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. రక్షణ చర్యల్లో తమ శిక్షకులకు సహాయపడే రోమియో, జూలీ ఈ నెల 7 న టర్కీ చేరుకున్నాయి. అప్పటి నుంచి సహాయక బృందాలకు ‘చేదోడు’ గా ఉంటున్నాయి.
ఇంకా .. తనను రక్షించిన ఓ మహిళా భారతీయ సైనికాధికారిని ఓ బాధితురాలు కృతజ్ఞత చూపుతు ఆమెను హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టర్కీ, సిరియాలలో చలిగాలులు వీస్తున్నా ఇండియా నుంచి ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలు చలించక సహాయచర్యల్లో నిమగ్నమై ఉంటున్నాయి. టర్కీలో భారతీయ వైద్య బృందం తాత్కాలికంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్సలు చేస్తున్నాయి.