పంజాబ్ లో భారీ విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఆ రెండు రాష్ట్రాల్లో గెలిచి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఓ బలమైన పార్టీగా అవతరించాలని ఆప్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
ఈ మేరకు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ విజయాల వెనక ఉన్నది ఎవరు. ఆయనకు ఎల్లప్పుడు వెంట ఉండి నడిపిస్తున్నది ఎవరనే అంశాలపై చర్చలు నడుస్తున్నాయి. వీటికి సమాధానాల్లోకి వెళితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎల్లప్పుడు వెంట ఉండి నడిపించేది పది మంది సన్నిహితులు.
దుర్గేశ్ పాథక్ (హిమాచల్ ప్రదేశ్)…
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుల్లో దుర్గేశ్ పాథక్ ఒకరు. ఒక్క మాటలో చెప్పాలంటే పాథక్ ను కేజ్రీవాల్ కు కండ్లు, చెవులుగా చెబుతారు. జాతీయ స్థాయిలో పార్టీ విస్తరించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అతి చిన్న వయస్సు(31)లోనే ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అన్నా హజారేతో కలిసి ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. 2015, 2020లో పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారు.
సందీప్ పాథక్ (గుజరాత్)….
ఐఐటీ న్యూఢిల్లీలో ప్రొఫెసర్ గా ఆయన పనిచేశారు. గుజరాత్ ఉమ్మడి ఇన్ ఛార్జ్ గా ఆయన్ని కేజ్రీవాల్ నియమించారు. సీసీటీవీలు, వైఫై, ఇంటి వద్దకే రేషన్ లాంటి కీలకమైన పథకాల వెనక ఆయన ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఇటీవల ఆయనను రాజ్యసభ ఎంపీగా కేజ్రీవాల్ నియమించారు. పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది.
సౌరవ్ భరద్వాజ్(హర్యానా)….
సౌరవ్ భరద్వాజ్ వృత్తి రీత్యా ఓ కంప్యూటర్ ఇంజినీర్. డిల్లీలోని గ్రేటర్ కైలాశ్ నియోజక వర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ఎలాంటి క్యాంపెయిన్ నిర్వహించినా ఆయన ముందుంటారు. ముఖ్యంగా బీజేపీని ఢీకొని హిందువుల ఓట్లను రాబట్టడంలో ఆయన పాత్ర విస్మరించలేనిది. ప్రస్తుతం ఢిల్లీలో కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రి గా కొనసాగుతున్నారు.
సంజీవ్ ఝా( చత్తీస్ గఢ్)
సంజీవ్ ఝా ఢిల్లీలోని బురారి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మల్యేగా గెలిచారు. పూర్వాంచల్ గా ఆయనను పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చిన వారిని పూర్వంచల్స్ అని సంబోధిస్తారు. అన్నా హజారే ఉద్యమంలో ఆయన కూడా పాల్గొన్నారు. విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
దిలీప్ పాండే( కర్ణాటక)
సంక్షోభం ఎదుర్కొంటున్న సమయాల్లో పార్టీ ఆయన వైపే చూస్తుంది. ట్రబుల్ షూటర్ గా, సంక్షోభ పరిస్థితుల నుంచి పార్టీని తన సామర్థ్యంతో ఇట్టే బయటపడేయగలరు. కరోనా సంక్షోభ సమయంలో ఆయన తన స్వంతగా ఒక కొవిడ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పేషెంట్లకు బెడ్లు, మెడిసిన్స్, ఆక్సిజన్ సరిగా అందేలా చూశారు.
వినయ్ మిశ్రా(రాజస్థాన్)..
కాంగ్రెస్ నాయకుడు మహభల్ మిశ్రా కుమారుడే వినయ్ మిశ్రా.. ద్వారకా నియోజకవర్గంలో ఆప్ లో ఆదర్శ్ శాస్రీ(లాల్ బహదూర్ శాస్త్రీ మనవడి)కి బదులుగా ఆయనకు టికెట్ ఇచ్చారు. అక్కడ విజయం సాధించి బలమైన నేతగా ఎదిగారు.
అజేశ్ యాదవ్(బిహార్)..
వృత్తిపరంగా వ్యాపారస్తుడు. ఆప్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఓ సాదారణ పౌరుడిలాగా మెదులుతుంటారు. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అనధికార కాలనీల అభివృద్ధికి ఆయన కృషిచేస్తున్నారు. ఈ విషయంలో పలువురి ప్రశంసలు పొందారు.
అజయ్ దత్ (హిమాచల్)..
ఢిల్లీలో సంత్ రవిదాస్ విగ్రహాన్ని కూల్చివేసినప్పుడు జరిగిన నిరసనల సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అంబేద్కర్ నగర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు శాసన సభకమిటీల్లో, ప్యానెల్స్ లోనూ సభ్యుడిగా పనిచేశారు.
గులాబ్ సింగ్ యాదవ్..(గుజరాత్)..
ఢిల్లీలోని మటియాలా నియోజక వర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తున్నారు.
Advertisements
సోమనాథ్ భారతీ(తెలంగాణ)..
ఢిల్లీలో మూడోవ సారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆప్ లోని ప్రముఖ నేతల్లో ఈయన ఒకరు. గతంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.