ట్విన్స్ ని చూస్తే ఎవరెవరో తెలుసుకోడానికి కన్ఫ్యూజన్ ఉంటుంది గాని..ఇద్దరూ ఒకేలా ఉన్నారేంటి అన్నదానికి ఏ కన్ఫ్యూజనూ ఉండదు. ఎందుకంటే వారు ట్విన్స్ కాబట్టి. వారు ఒకేలా పుట్టడానికి జెనిటికల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. కానీ మనం ఒక ఊళ్ళో మనకు పరిచయం ఉన్న మనిషులు వేరే ఊళ్ళో తారస పడుతుంటారు.

గబుక్కున పలకరిస్తాం.చనువు కూడా తీసుకుంటాం. వాళ్ళు మనల్ని ఎవడ్రా వీడు అన్నట్టుగా అదోలా చూస్తారు. ఎందుకంటే మనకు తెలిసిన వ్యక్తికి, ఇప్పుడు పలకరించిన మనిషికీ పోలికలు దాదాపుగా ఒకటే ఉంటాయి. మనది భ్రమని ఇద్దదూ ఒకటి కాదు వేరు వేరనీ, కానీ ఇద్దరూ ఒకేలా ఉన్నారని మనకి చాలా వింతగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. అలా మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారట.!
అయితే, ఆ ఏడుగురు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో.. అసలు ఉన్నారో లేదో కూడా మనకి పూర్తిగా తెలియదు. ఇన్ని కోట్ల మంది జనాభాలో వారి వివరాలు తెలుసుకోవడం చాలా కష్టం. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల ద్వారా నూటికో కోటికో ఒక్కరికి తమ పోలికలతో ఉన్న వారు తారసపడుతుంటారు.
దాదాపు 200 దేశాలలోని కోట్లాది మంది జనాలలో మనలను పోలిన వ్యక్తులను గుర్తించడం సాధ్యమయ్యేపనేనా…అంటే మేం సాధ్యం చేస్తామని ఓ కంపెనీ చెబుతోంది. ప్రపంచంలో మిమ్మల్ని పోలీన వ్యక్తులు ఏ మూలన ఉన్నా సరే.. వారి వివరాలను వెతికి పట్టుకుని మీకు చెబుతామని అంటోంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మాకు కాస్త ఫీజు చెల్లించడమేనని పేర్కొంది. ఇప్పటికే చాలామంది స్ట్రేంజర్ కవలలను కలిపామని చెబుతోంది. ఆ కంపెనీ పేరు.. ట్విన్స్ స్ట్రేంజర్స్ డాట్ కామ్.. ఈ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ కూడా ఉంది.
కంపెనీ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ ఫొటోను అప్ లోడ్ చేయాలి. అద్దంలో చూసుకుంటే మీరు ఎలా కనిపిస్తారో అలాంటి సాధారణ ఫొటోను అప్ లోడ్ చేయాలి. తర్వాత మీ పేరు, ఊరు, దేశం తదితర వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. దీంతోపాటు ప్రొఫైల్ గ్యాలరీలో మరో ఐదు ఫొటోలను (వేర్వేరు రకాలుగా తీసినవి) అప్ లోడ్ చేయాలి. ఆపై కొంత మొత్తం ఫీజు చెల్లించాలి.
ఇదంతా పూర్తయ్యాక.. ఆ కంపెనీ వెబ్ సైట్ లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారిలో మీలాంటి పోలికలు ఉన్న వ్యక్తుల ఫొటోలు, వివరాలను మీకు పంపిస్తుంది. అందులో మీకు చాలా దగ్గరి పోలికలు ఉన్న వారితో పరిచయం పెంచుకుని, వీలైతే బయట కలుసుకునేందుకు ఈ కంపెనీ తోడ్పడుతుంది. ఇప్పటికే ఇలా కలుసుకున్న స్ట్రేంజర్ ట్విన్స్ ఫొటోలు, వివరాలు కూడా ఈ వెబ్ సైట్ లో పొందుపరిచింది.