రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు అందరు కలిసికట్టుగా పని చేయాలని కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో ఖర్గేతో ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఏఐసీసీ కార్యదర్శులు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
దాదాపు రెండు గంటల పాటు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు వివిధ అంశాలపై చర్చించారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాకుండా పార్టీ ప్రతిష్టను పెంచేందుకు పని చేయాలని ఖర్గే సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.ఇక భారత్ జోడో యాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు.
శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వారు రాహుల్ ను అభినందించారు. ముగింపు సభకు రాష్ట్ర ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా హాజరయ్యారు.
ఇది ఇలా ఉండగా భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే శ్రీనగర్ లో భారీగా మంచు కురిసినప్పటికీ..కార్యక్రమం సజావుగా సాగింది.