మెగా మేనల్లుడు సాయి తేజ్ ప్రమాదానికి అతి వేగమే కారణమనేది పోలీసుల వెర్షన్. సీసీ ఫుటేజ్ చూస్తుంటే అంత స్పీడ్ గా ఏమీ వెళ్లడం లేదనేది అభిమానుల వాదన. బైక్ రైడింగ్ జరిగిందా..? అనేది కొందరి అనుమానం. ఒక్క తేజ్ పైనే కేసు ఎందుకు.. రోడ్డుపై మట్టి, ఇసుక ఉండేలా నిర్లక్ష్యం వహించిన వారిపైనా చర్యలు తీసుకోవాలనేది మరికొందరి ప్రశ్న. గత 24 గంటలుగా ఎన్నో వార్తలు.. మరెన్నో అనుమానాలు.. తేజ్ అయితే ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అతను కోలుకుని మాట్లాడితేగానీ ఏం జరిగిందనేది బయటకు రాదు.
ప్రస్తుతం తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఐకియా స్టోర్ దగ్గర జరిగిన బైక్ ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. ముందుగా మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా… మెరుగైన చికిత్స కోసం అపోలోకు తరలించారు. 48 గంటల అబ్జర్వేషన్ అవసరమని డాక్టర్లు శుక్రవారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శనివారం ఉదయం కూడా మరోసారి వివరాలు వెల్లడించారు. కాలర్ బోన్ విరిగినట్లు నిర్ధారించిన వైద్యులు.. అంతర్గత గాయలేమైనా ఉన్నాయా అని వైద్య పరీక్షలు చేశారు. సిటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. అయితే పెద్ద గాయాలేమీ కాలేదని తేల్చారు. ఏ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వలేదని తెలిపారు. ఆదివారం కాలర్ బోన్ ఫ్రాక్చర్ కు సర్జరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక మంత్రి శ్రీనివాస్ యాదవ్ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వినాయకుడి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటాడని అన్నారు. అపోలో వైద్యులతో మాట్లాడిన ఆయన.. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పినట్లు వివరించారు. అలాగే చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్, ఆయన భార్య ఉపాసన కూడా అపోలోకు వచ్చారు. అభిమానులు కూడా పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు.
తేజ్ రోడ్డు ప్రమాదంపై మా అధ్యక్షుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి ముందు తన ఇంటి నుండే వెళ్లాడని.. అతనితోపాటు తన కుమారుడు కూడా ఉన్నాడని చెప్పాడు. వీరిద్దరూ తరచూ రైడింగ్ కు వెళ్తుండటంపై చాలాసార్లు హెచ్చరించాలని అనుకున్నట్లు తెలిపాడు నరేష్. గతంలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటిరెడ్డిల కొడుకులు ఇలాంటి ప్రమాదాల వల్లే మరణించారని.. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదన్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కూడా ఈ ఘటనపై తనదైన రీతిలో స్పందించాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడని తేజ్ పై కేసు పెట్టారు సరే. మరి.. రోడ్డుపై ఇసుక, మట్టి పేరుకుపోవడానికి కారణమైన వారిపై, రోడ్లు శుభ్రం చేయించని సంబంధిత అధికారులపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశాడు. ఇలా చేస్తే ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడే ఛాన్స్ ఉందని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు ఆర్పీ పట్నాయక్.
సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని అటు మెగా అభిమానులు, ఇటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మంచు విష్ణు, గోపీచంద్ మలినేని, దేవిశ్రీప్రసాద్, తమన్ సహా పలువురు స్టార్స్ ట్వీట్స్ చేశారు.
Wishing you a speedy recovery brother @IamSaiDharamTej ❤️
— Jr NTR (@tarak9999) September 11, 2021
రాజకీయ ప్రముఖులు సైతం తేజ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సహా పలువురు నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2021
Wishing @IamSaiDharamTej a speedy recovery and good health. We're all rooting for you to come back with the same stride and energy!
— Lokesh Nara (@naralokesh) September 11, 2021
సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ టైమ్ లైన్
– శుక్రవారం రాత్రి 7.44 గంటలకు గచ్చిబౌలి బయలుదేరిన తేజ్
– రాత్రి 7.58 గంటలకు కేబుల్ బ్రిడ్జ్
– రాత్రి 8.01 గంటలకు కోహినూర్ హోటల్ దాటి ఐకియా వైపు వెళ్లిన తేజ్
– రాత్రి 8.05 గంటలకు యాక్సిడెంట్
– రాత్రి 8.07 గంటలకు 108కు ఫోన్
– రాత్రి 8.25 గంటలకు మెడికవర్ ఆసుపత్రిలో చేరిక
– రాత్రి 8.29 గంటలకు మెడికవర్ కు చేరుకున్న పోలీసులు
– రాత్రి 8.40 గంటలకు సాయి తేజ్ కు చికిత్స
– రాత్రి 8.59 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు
– రాత్రి 10.45 గంటలకు అపోలో ఆసుపత్రికి తరలింపు