– నాగారంలో మే”ఘరానా కబ్జా”
– ఏడెకరాల చెరువు భూమి మాయం!
– పెట్టుబడి పేరుతో కృష్ణ మాయ
– ఎవరూ నోరెత్తకుండా అమ్యామ్య
– ఐకాం మాటున మెగా స్కెచ్
– ఆయుధాల తయారీ కంపెనీకి ఇప్పటినుంచే ప్లాన్
– అనుమతులు వస్తే కబ్జా భూమిలోనే తయారీ!
– తొలివెలుగు క్రైం బ్యూరో ఇన్వెస్టిగేషన్ లో సంచలన నిజాలు
– మేఘా బాగోతం పార్ట్-2
మొన్న అధికారుల దగ్గర లాబీయింగ్ కోసం ఐఏఎస్ రజత్ కుమార్ కుమార్తె పెళ్లికి విందు, వినోదాలు ఏర్పాట్లు చేసి బద్నాం అయింది మేఘా సంస్థ. నిన్న పెట్రోల్ వెలికితీసే రిగ్గుల తయారీ కంపెనీ డ్రిల్ మెక్ స్పా ని కొనుగోలు చేసి ఇటలీదని.. భారీ పెట్టుబడులంటూ బడాయి పోయింది. ఈ విషయాలన్నింటినీ తొలివెలుగు బట్టబయలు చేసింది. ఈ క్రమంలోనే మేఘా బాగోతాలపై ఫోకస్ చేసింది తొలివెలుగు క్రైం బ్యూరో. అలా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాల్టీలోని ఏడెకరాల ప్రభుత్వ భూమి కబ్జా పర్వం వెలుగు చూసింది. బడా కంపెనీ అని గొప్పలు చెప్పుకుంటూ దిగజారుడు చర్యలకు పాల్పడుతున్న మేఘా కబ్జా కథలన్నీ ఇకపై తొలివెలుగు వరస కథనాలతో ప్రజల ముందు ఉంచనుంది.
నాగారంలో ఐకాం కంపెనీ!
మాన్యుఫాక్చరింగ్ కంపెనీగా ఉన్న ఐకాం.. భారత రక్షణ రంగానికి టెలికాం సర్వీస్ లు అందిస్తోంది. ఆయుధాల తయారీకి డిఫెన్స్ ప్రైవేటీకరణ చేయడంతో ఈ కంపెనీలో మేఘా సంస్థ 2020లో 500 కోట్లు పెట్టుబడి పెట్టింది. దేశ రక్షణ కోసం ఆయుధాలు తయారు చేయాలంటే ఎంతో నిబద్దత, నిజాయితీ, దేశం కోసం నిత్యం ఆరాటపడే అలవాటు ఉండాలి. అయితే.. మేఘా ఎంట్రీ కాకముందు ఐకాం.. బఫర్ జోన్ లో ఉన్న సర్వే నెంబర్ 58లో 13 గుంటలు, 56లో 9, 57లో 1, 60లో 8, 61లో 12 గుంటలు ఇలా మొత్తం ఎకరం మూడు గుంటల పట్టా భూమిలో నిర్మాణాలు చేసింది. మేఘా రాక తర్వాత ఏకంగా చెరువునే మింగేస్తోంది. సర్వే నెంబర్ 59లో హెచ్ఎండీఏ లేక్ ఐడీ నెం.2700/ఈఎన్/03లో ఏడెకరాల ఒక గుంట చెరువు ఉంది. దీన్ని కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపట్టింది.
టాప్ టూ బాటం మామూళ్ల పర్వం!
ప్రభుత్వ రికార్డులు ఏం చెబుతున్నా.. మనం చేసే పనులకు ఎవరు అడ్డురారని హామీ ఇచ్చారట మేఘా బాస్ కృష్ణారెడ్డి. లోకల్ గా ఇష్యూ కాకుండా ఉండేందుకు మున్సిపాల్టీలో ఓ నేతను డీల్ చేయాలని పెట్టినట్లు వినికిడి. అతను మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు.. పార్టీల నేతలను గులాబీ నోట్లతో కొట్టి బయటకు పొక్కకుండా చేసినట్లు తెలిసింది. స్థానిక బీజేపీ నేత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. జాలు బావి కుంట కాస్తా గజం జాగా లేకుండానే కథ ముగింపునకు తీసుకొచ్చారు. అందులోకి వచ్చే మురుగు నీటిని పక్కనే ఉన్న ప్లాట్లలోకి మళ్లించారని ఆరోపిస్తున్నారు వాటి ఓనర్స్.
హెచ్ఎంటీ బేరింగ్స్ నగర్ కి ఎసరు
రాబోయే రోజుల్లో ఆయుధాల తయారీకి మరింత భూమి అవసరం ఉన్న నేపథ్యంలో పక్కనే ఉన్న హెచ్ఎంటీ బేరింగ్స్ నగర్ పై మేఘాకు కన్ను పడింది. సర్వే నెంబర్ 47, 55, 56, 60లోని లే అవుట్స్ లో ఉన్న ప్లాట్ ఓనర్స్ ని ఇనాం భూములని బెదిరించి లాక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి. రోడ్లు, పార్క్, ఖాళీ ప్రదేశం కూడా ఐకాం కంపెనీ వశం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్క ఎకరం కొనుగోలు చేసిన ఐకాం కంపెనీ ఇప్పుడు సుమారు 10 ఎకరాల్లో ఉంది. మేఘా సంస్థ ఎంట్రీ తరువాత బరితెగించి కబ్జాలు జరిగాయి. అక్కడ చెరువు అనే అనవాలు కూడా లేకుండా పోయింది.
ఈ కక్కుర్తితో దేశానికి రక్షణ సేవ చేయగలరా?
ఐకాం కంపెనీ సెల్ టవర్స్ నిర్మాణం.. డిఫెన్స్ కి వైర్ లెస్ టెలికాం సేవలు అందిస్తోంది. అయితే ఇన్నాళ్లపాటు ఒక ఎత్తు.. ఇప్పుడు మరో ఎత్తు.. ఆయుధాల తయారీని ప్రైవేట్ పరం చేయడంతో ఇక్కడ కొన్ని ముడిపదార్ధాల తయారీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే డిఫెన్స్ లో అనుభవం ఉన్న కంపెనీని మేఘా కృష్ణారెడ్డి చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. నాగారం మున్సిపాల్టీ లాంటి ప్రాంతంలో 50 కోట్లు ఖర్చు పెడితే పదెకరాలు ఎలాంటి లిటిగేషన్ లేని భూమి దొరుకుతుంది. కానీ.. చెరువు భూమిని కబ్జా చేయడంతో వారి కక్కుర్తిని బయటపెట్టుకున్నారు.
రికార్డులన్నింటినీ సంపాదించిన తొలివెలుగు
పాత రెవెన్యూ రికార్డులైన పహాణీల్లో ఏముంది.. ధరణిలో ఏం చూపించారు.. చెరువు శిఖం ఎంత..? బఫర్ జోన్ లో ఏం నిర్మించారు..? హెచ్ఎండీఏ రికార్డుల్లో లేక్ ని గుర్తించి నెంబర్ ఇచ్చిన వాటిన్నింటిని సాక్షాధారాలతో సహా సంపాదించింది తొలివెలుగు క్రైం బ్యూరో. మేఘా బాగోతాలపై ఇక నుంచి వరస కథనాలు తొలివెలుగు వస్తాయి. ఆధారాలు లేకుండా ఎప్పుడూ వార్తలు ఇవ్వం. ప్రతీ దానికి సాక్షాలతో సహా వెలుగులోకి తీసుకొస్తాం. కూకట్ పల్లిలో ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన భూములను మేఘా తన అనుచర గణంతో ఎలా దోచేసే ప్రయత్నం చేస్తుందో పార్ట్-3లో చూద్దాం.