కేంద్రంలో బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమయింది. కరోనా వైరస్ వల్ల పేదలు ఆకలి చావులకు గురవుతుంటే… కేంద్రం సంస్కరణల పేరుతో వారిని పట్టించుకోకపోవటంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
ముఖ్యంగా వలస కూలీల అంశంపై కాంగ్రెస్ దూకుడుగా ఉంది. వలస కూలీలపై చార్జీ వసూలు చేయటాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని కాంగ్రెస్ అధినేతత సోనియా ప్రకటించిన నాటి నుండి బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా వలస కూలీలతో మీరూ వెళ్లండి అంటూ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ రాజకీయ వేడిని మరింత రగిల్చాయి. ఇక బెంగాల్, తెలంగాణతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కేంద్ర ప్యాకేజీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది.
కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మెగా ప్రతిపక్ష పార్టీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కాబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, కేంద్రం అనుసరిస్తున్న పద్దతులపై చర్చించనున్నాయి. అయితే… ఈ మీటింగ్ కు సీఎం కేసీఆర్, జగన్ హజరవుతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఏపీ సీఎం జగన్ దూరంగా ఉంటారన్న సమాచారం అందుతున్నప్పటికీ, కేసీఆర్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.