– ఆపరేషన్ డమ్మీ పీఎం
– 80 వేల కోట్ల బ్లాక్ మనీ గేమ్
– ప్రాజెక్ట్ కరప్షన్ తో ప్రైమ్ మినిస్టర్ కుర్చీ !
– ప్రాంతీయ పార్టీలకు డబ్బు ఎర
– కేసీఆర్ ను ఉపయోగించి..కృష్ణారెడ్డి ఆట!
– ఊ అంటే..ఢిల్లీ కోట బద్ధలు కొడతామనే…
– వార్నింగుల వెనుక “మెగా” కాంట్రాక్టర్ హస్తం!
బడా కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల చెప్పుచేతుల్లో ఉంటారని విన్నాం. కానీ బంగారు తెలంగాణలో సీన్ రివర్సైనట్టు కనిపిస్తోంది. అవినీతిలో తన ప్రతిభతో అంచలంచలుగా వేల కోట్లకు పడగలెత్తిన ఒక “మెగా”కాంట్రాక్టర్ ..ఇప్పుడు ఏకంగా దేశ రాజకీయాలను శాసించటానికి తహతహలాడిపోతున్నట్టు సమాచారం. అంతేకాదు..ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసి..తన పలుకుబడిని ఉపయోగించి కొన్నిచిన్నరాష్ట్రాలకు డబ్బుఎరవేసి, ఆయా రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలను తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నట్టు తెలుస్తోంది.పైగా ఈ దందాకంతటికీ ఒక ఫ్రంటో..టెంటో అని పేరు పెట్టి..ఆ పనులకు కేసీఆర్ ను ఉపయోగించుకుంటున్నాడని జాతీయ రాజకీయాల్లో తలపండిన విశ్లేషకులు అనుకుంటున్నారు.
ఆ మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన ఆరోపణలను విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరుగుతోందనీ,కాళేశ్వరం సొమ్మును కేసీఆర్ ప్రభృతులు ఏటీఎంలా వాడుకుంటున్నారని నడ్డా తీవ్ర ఆరోపణలు చేశారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఒక్కో దఫా ఒక్కో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులు వచ్చి కేసీఆర్ తో భేటీలు కావటం చూస్తుంటే..దీనివెనుక సదరు “మెగా” కాంట్రాక్టర్ హస్తమే ఉందన్నఅనుమానాలు నిజమవుతున్నాయి.ఇటీవలే ఈ మధ్య లాలూ తనయుడితో భేటీ అయిన కేసీఆర్..తన తాజా ప్రెస్ మీట్ లో రేపోమాపో బెంగాల్ దీదీ తనను కలిసేందుకు వస్తుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు.. తెలంగాణ వచ్చినప్పుడు దోశ తినిపించాలని దీదీ అన్నట్టు సరదాగానే చెప్పినా.. ఆ దోశ ఏంటో..అది అరేంజ్ చేసే కాంట్రాక్టర్ ఎవరో ఢిల్లీలోని విశ్లేషకులు గుర్తుపట్టేశారు. లాలూ తనయుడితో భేటీలో కూడా రానున్నపార్లమెంట్ ఎన్నికల కోసం 300 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చి పంపినట్టు సమాచారం.అంతకుముందు తమిళనాడుకు సైతం 100 కోట్లు సదరు ప్రాజెక్టుల బాపతు సొమ్మే వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు గట్టిగా వాదిస్తున్నారు. అంతేనా.. అసలు ఢిల్లీకి ఎసరు పెట్టాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో బాగా తెలిసిన మన రాజకీయ చాణక్యుడు యూపీలో యోగీ ఓటమి కోసం అఖిలేష్ కు కూడా 300 కోట్ల పైగానే ప్యాకేజ్ ప్రకటించినట్టు గులాబీ వర్గాల్లోనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
దీంతో బీజేపీ జాతీయ నాయకులు అనుమానిస్తున్నట్టుగానే ఇప్పటికే తెలంగాణలో కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి వివిధ ప్రాజెక్టుల అవినీతి సొమ్ము 80 వేల కోట్ల నుంచి వివిధ రాష్ట్రాల ఎన్నికలకు .. తరచూ డ్రా చేస్తూనే ఉన్నట్టు సమాచారం. ఇందుకు సూత్రధారి “మెగా”అయితే.. ఆయనకు బాగా సహకరిస్తున్ననాయకుడు ఎవరనేది జగమెరిగిన సత్యమేననేది విశ్లేషకుల ఫీలింగ్. ప్రస్తుతం ఈ లెక్కలన్నీకేంద్రం పెద్దల చేతుల్లో సాక్ష్యాలతో సహా ఉన్నాయట.
పదే పదే కేంద్రంలోని బీజేపీ అవినీతిని బయటపెడతామనే మేకపోతు గాంభీర్యం వెనుక ఆంతర్యం కూడా ఇదే. ఇప్పటికే కాళేశ్వరం అవినీతిపై కేంద్ర నీటి పారుదల శాఖ పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి పెట్టుకోవటం..అందుకు సంబంధించిన ఫైల్స్ అన్నీఏకంగా హోంమంత్రి టేబుల్ మీదికి చేరినట్టు తెలుసుకున్నసదరు “మెగా”కాంట్రాక్టర్ కేసీఆర్ పై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. అందుకే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు.. ముందుకు ముందే కేంద్రం అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని వార్నింగ్ లు మొదలు పెట్టేశారు సారువారు. అంతేనా..ఫ్రంట్లు, టెంట్లు లేవంటూనే.. అవసరమైతే దేశం కోసం మరో కొత్త పార్టీ స్థాపిస్తామనే హింట్లు కూడా ఇస్తున్నారు. ఓ వైపు కేంద్రంలో చక్రం తిప్పుతాను..అంతా నా చెప్పు చేతల్లో ఉందని చెప్పుకునే సదరు “మెగా”కాంట్రాక్టర్.. అవసరమైతే తానే ఓ పీఎం క్యాండిడేట్ ను సృష్టిస్తాను అని నిరూపించే యత్నమే ..ఢిల్లీపై కేసీఆర్ తాజా వాగ్బాణాలు అని రాజకీయ పండితుల భావన.
కేంద్రంలోని బీజేపీని కూలదోయటమే కాదు.. దాంతో పాటు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూలదోయటం కూడా “మెగా” కుట్రగా కనబడుతోంది. బీజేపీ కాకుండా తమ చెప్పుచేతల్లో నడిచే రాష్ట్రప్రభుత్వాలైతే.. తమ అక్రమ ప్రాజెక్టులను ఎక్కడపడితే అక్కడ, విచ్ఛల విడిగా ప్రారంభించవచ్చనేది సదరు “మెగా” కుట్రదారు ఆలోచన అని భావిస్తున్నారు. ఇంతకాలం అంతా థర్డ్ ఫ్రంట్ అని అనుకుంటూ వస్తున్నారు. కానీ తెరవెనుక సూత్రధారి తెలంగాణ “మెగా”కాంట్రాక్టరే అని తెలిశాక.. కారుపార్టీలోని సీనియర్లలో కొందరు తమ బాస్ ఆధ్వర్యంలో రాబోయేది “మెగా” ఫ్రంట్ అని..అది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పటం ఖాయమని లీకులిస్తున్నారు.అంతేనా త్వరలో తమ బాస్ ప్రధాని కావటం ఖాయమని తెగ సంబరపడిపోతున్నారు కూడా.