సినిమా టికెట్లకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన ఆచార్య మూవీ 29న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టికెట్ రేట్ల గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా సమయంలో చాలా రంగాలు కుదేలయ్యాయని.. వాటిలో సినీ పరిశ్రమ కూడా ఒకటని అన్నారు చిరు. సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో పడిందని గుర్తు చేశారు. వడ్డీగా 50 కోట్లు కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా? ప్రభుత్వాలు కనికరించి జీవోలు ఇస్తేనే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు.. మనం కూడా ఒక పది రూపాయలు ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారని అన్నారు.
ఇది అడుక్కుతినడం కాదని.. వినోదాన్ని అందించే ప్రయత్నంలో అనుకోకుండా అంతకంతకీ వడ్డీలు అయ్యాయని తెలిపారు మెగాస్టార్. వడ్డీనే ఒక మీడియం సినిమా బడ్జెట్ అంత అయిందని.. తాము కూడా 42 శాతం టాక్స్ లు కడుతున్నామని చెప్పారు. అందులో కొద్దిగా తిరిగి ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడగడంలో తప్పేమీ లేదన్నారు.
తనకు నిత్య విద్యార్థిగా ఉండడమే ఇష్టమని.. అప్పుడే ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకొనే అవకాశం వస్తుందని చెప్పారు. రోజూ తనకు తారసపడే ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి, వారి నుంచి వచ్చే ప్రతి మాట.. అలాగే చిన్న చిన్న పిట్టకథలు దగ్గరనుంచి .. పెద్ద పెద్ద విషయాలు చెప్పే ప్రవచకులు దాకా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ తాను ఆచార్యను చూస్తుంటానని తెలిపారు చిరంజీవి.
ఆచార్య మూవీకి ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని పచ్చజెండా ఊపాయి.