నందమూరి తారకరత్న భౌతికకాయానికి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. శంకర్ పల్లి మండలం మోకిళ్లలోని తారకరత్న నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డితో చిరంజీవి, బాలయ్య మాటామంతీ చేశారు.
కాగా అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతికకాయాన్ని సోమవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.
ఇక ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తారకరత్న. అనంతరం హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నాడు. అయితే సినీ అరంగేట్రంతోనే తారకరత్న ప్రపంచ రికార్డును సాధించారు. ఏ హీరో కూడా ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించలేదు. ‘అమరావతి’ మూవీలో తారకరత్న నటనకు నంది అవార్డు కూడా వచ్చింది.