ఓ సామాన్య నటుడిగా సినీఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. అరవై యేళ్ళు పైబడినా అంతే గ్రేస్ తో డ్యాన్సులు. ఫైట్లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. స్టార్ హీరోగా అగ్రపథంలో కొనసాగుతూనే సామాజిక బాధ్యతను సైతం విస్మరించలేదు చిరు. ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లాంటి ఎన్నో సేవాకార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
కరోనా కాలంలో సినీ కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తన దాన గుణాన్ని చాటుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ అందరివాడయ్యారు. తాజాగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు మెగాస్టార్.
కష్టాల కడలిలో బతుకీడుస్తోన్న అలనాటి నటి పాకీజా (అలియాస్ వాసుకీకి), సీనియర్ సినిమాటోగ్రాఫర్‌లకు సాయమందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు చిరంజీవి. సీనియర్ నటుగు మోహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రకు ఎంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత వాసుకీ పేరు పాకీజాగానే మారిపోయిందంటే ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల్లోకి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో తెలుగు, తమిళ్ సినిమాల్లో లేడీ కమెడియన్‌గా మెప్పించిన పాకీజా(వాసుకి) గతకొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల్తో సతమతమవుతోంది.
బిజీ ఆర్టిస్టుగా కోట్లు సంపాదించిన ఆమె ఇప్పుడు కుటుంబ, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సినిమా అవకాశాలు లేక ఇప్పుడు ఓ హాస్టల్‌లో బతుకు వెళ్ళదీస్తోంది. ఇటీవల వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తన దీని స్థితిని వివరించారామె. ఒకప్పుడు నవ్వించిన పాకీజా పుట్టెడు దు:ఖంతో తన కష్టాలు చెప్పుకొని కంటతడి పెట్టించారు.
కాగా వాసుకీ గురించి తెలుసుకున్న మెగాబ్రదర్ నాగబాబు ఆమెకు లక్షరూపాయల ఆర్థిక సాయం అందించారు. సినిమాల్లో కానీ, బుల్లితెరపై కానీ పాకీజాకు అవకాశాలు ఇప్పించేందుకు తన వంతు సాయపడతానని ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాకీజా పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు.
ఆమెకు ఆర్థికంగా చేయూత అందిస్తూ లక్షరూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే సినిమాలు, సీరియల్స్ లోనూ పాకీజాకు క్యారెక్టర్స్ ఇచ్చి ఆమె తన కాళ్లపై తాను నిలబడేలా సాయపడాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.
ఒకప్పడు చిరంజీవి నటించిన నాగు, పులి బెబ్బులి, రాణి కాసుల రంగమ్మ సినిమాలు ఇప్పటి జెనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు..కానీ ఒకప్పుడు అవి సూపర్ డూపర్ హిట్స్.
ఆ సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసారు దేవ్‌రాజ్. తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో 300కు పైగా సినిమాలకు పనిచేసిన సీనియర్ కెమెరామేన్ ఆయన. అయితే ప్రస్తుతం దేవరాజ్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఆయన కుంటుంబాన్ని చుట్టుముట్టాయి. కెమెరా మేన్ దేవ్‌రాజ్ పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి ఆయనను కలిసి రూ.5లక్షలు చెక్కు అందించారు. దేవ్‌రాజ్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు చిరు.
అండగా నిలిచిన చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు దేవరాజ్. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, ఎంజీఆర్, రజినీకాంత్, రాజ్ కుమార్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు కూడా దేవరాజ్ కెమెరామేన్ గా పనిచేశారు.
Megastar @KChiruTweets
Offered assistance of Five Lakhs to Senior Cameraman #Devraj garu (Tingurangadu, Raani Kaasula Rangamma, Naagu, Puli Bebbuli fame).#Chiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/9x0sJQ4TfE— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 2, 2023