హిట్టు,ప్లాపులతో సంబంధం లేకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టార్డమ్ ఉన్న హీరోగానే కాకుండా వేల్యూస్ ఉన్న పొలిటీషియన్ గా పవన్ క్రేజ్ అనితర సాధ్యం.అభిమానులందరూ ఆయనను డెమీ గాడ్గా అభివర్ణిస్తారు.
ఇప్పుడు ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి మరొక సారి చెప్పారు. సాధారణంగా నటులందరికీ అభిమానులు ఉంటే..పవన్కు మాత్రం భక్తులు ఉన్నారని.. పవర్ స్టార్ను ఆకాశానికెత్తేశారు. ప్రముఖ గాయని స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ కార్యక్రమంలో పాల్గొన్న చిరు పలు విశేషాలను పంచుకున్నారు.
నటుడిగా, రాజకీయనాయకుడిగా పవన్ మీకెలా ఇష్టం? అని ప్రశ్నించగా, “పవన్‌కల్యాణ్ సహజ శైలిని బట్టి చూస్తే రాజకీయ నాయకుడిగానే నాకు ఇష్టం. బాధలకు స్పందించే తీరు, సాయం చేయాలన్న గుణం చిన్నప్పటి నుంచే అతడిలో ఉంది. ఒకానొక సందర్భంలో నక్సల్స్‌లోకి వెళ్లిపోతాడేమోనని అనిపించింది.
తుపాకులతో ఆడుకునేవాడు. నేను సింగపూర్ షూటింగ్స్‌కు వెళ్లేటప్పుడు ‘అక్కడి నుంచి ఏం తీసుకురాను’ అని అడిగితే, ‘ఇక్కడ మంచి గన్స్ దొరకడం లేదు. అక్కడి నుంచి తీసుకురా అన్నయ్యా’ అని చెప్పేవాడు.
డమ్మీ గన్స్ అయినా, అవి సెమీ ఆటోమేటిక్. ఆ తుపాకులు పట్టుకుని తిరుగుతుంటే రైల్వేస్టేషన్‌లో ఆపేశారు. డమ్మీ తుపాకులని తెలిసి వదిలేశారు. అతడికి ఉన్న కల్ట్ ఇమేజ్ పూర్తిగా భిన్నమైనది. ‘అందరికీ అభిమానులు ఉంటారు. పవన్‌కు భక్తులున్నారు'” అని చిరు చెప్పుకొచ్చారు.