ఈనెల 22వ తేదీన విడుదల కాబోతున్న జార్జిరెడ్డి సినిమాలోని ‘అడుగు…అడుగు’ అంటూ సాగే లిరికల్ వీడియోను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రసంగింస్తూ జార్జిరెడ్డి లాంటి సినిమాలు మరిన్ని రావాలని…నేటి తరానికి ఈ చిత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుందని అన్నారు. 1972లో తాను ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో తొలిసారిగా జార్జిరెడ్డి పేరు విన్నానని చెప్పారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ వింటున్నానన్నారు. సినిమాలోని ‘అడుగు…అడుగు’ పాట చూసిన తర్వాత చాలా ఉద్వేగానికి గురయ్యానన్నారు. అప్పట్లో తాను విన్న దాన్ని బట్టి, ఆయన ఎలాంటి ఆశయాలతో ఉండేవారో అర్ధమవుతుందన్నారు. అన్యాయం, అణిచివేతలపై విద్యార్ధి నాయకుడిగా జార్జిరెడ్డి ఎలా స్పందించారో సినిమాలో చాలా చక్కగా చూపించినట్టుగా అర్ధమవుతుందన్నారు చిరంజీవి. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. జార్జిరెడ్డి సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని…తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చిరంజీవి చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మాత అప్పిరెడ్డి నిర్మించారు. సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్ లు సంగీతం సమకూర్చారు.