రీమేక్ ఈ పదం ఇపుడు క్రేజీగా మారిపోయింది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ట్రెండ్ ఇది. ఇప్పటికే టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చాలా వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా ఇలా రీమేక్ చిత్రాల్లో నటిస్తుండడంపై ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా కొంత నిరాశ చెందుతూనే ఉంటారు. అయితే ఈ విషయంపై తాజాగా చిరు స్పందించారు.
చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చిరు రీఎంట్రీ తర్వాత నుంచి ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఆయనికి హిట్ తెచ్చి పెట్టింది. ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
రీమేక్ సినిమాలు అంటే ఎందుకు అంత తక్కువగా చూస్తారు. రీమేక్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అది ఒక ఛాలెంజ్. ఒక కంపేరిటివ్ స్టడీలో మనం నిలబడగలమా లేదా అనేది ఎప్పుడూ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. నేను చేసిన చిత్రాల్లో అన్ని రీమేక్ లు ఒరిజినల్స్ కంటే కూడా ఎక్కువగా కలెక్షన్స్ చేశాయి. ఆ సినిమాలకు మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అలాగే నా పాత్రలకు కూడా ప్రశంసలు దక్కాయి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కంపేర్ చేసినా సరే నేను నిలబడగలను అనడానికి నా హిస్టరీనే చెబుతుంది అంటూ చిరంజీవి రీమేక్ సినిమాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
కాగా చిరంజీవి డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. ఈ రీమేక్ సినిమాలు కూడా చిరు కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అవేంటో ఓసారి లుక్కేసేద్దాం.
ఆరాధన, రాజా విక్రమార్క, ది జెంటిల్ మెన్, చట్టానికి కళ్ళు లేవు, పట్నం వచ్చిన పతివ్రతలు, విజేత, పసివాడి ప్రాణం, ప్రతిబంద్, ఘరానా మొగుడు, హిట్లర్, స్నేహం కోసం, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, ఎస్పీ పరశురామ్, ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ చిత్రాలు చిరు కెరీర్ లో వచ్చిన రీమెక్ ల లిస్ట్. ఇక భోళా శంకర్ మూవీ తమిళంలో విజయం సాధించిన ‘వేదాలం’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.