– దత్తాత్రేయను పొగుడుతూ ప్రధాని మోడీ లేఖ
– అలయ్ బలయ్ పై ప్రశంసలు
– ఈసారి వేడుకల్లో సందడి చేసిన మెగాస్టార్
– డప్పు వాయించి డ్యాన్సులు
– అలయ్ బలయ్ పై చిరు సినిమా తీయాలన్న కేరళ గవర్నర్
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పలు పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ అలయ్ బలయ్ ను ప్రశంసిస్తూ దత్తాత్రేయకు లేఖ రాశారు. పండుగ పూట అన్ని సామాజిక వర్గాల ప్రజలను ఏకం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై పండుగలను జరుపుకునే సాంప్రదాయం భారత్ లో ఉందని చెప్పారు.
ఈసారి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. కార్యక్రమానికి హాజరైన ఆయన డప్పు వాయించి అందరినీ ఉత్సాహ పరిచారు. అక్కడ వున్న కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. చిరు చిందులు వేయడంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని చెప్పారు చిరంజీవి. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న అలయ్ బలయ్ దేశవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు.
ఇక ఈ కార్యక్రమంలో చిరుతో సేల్ఫీలు దిగడానికి అనేక మంది మహిళలు ఎగబడ్డారు. అదే సమయంలో ప్రవచనకర్త గరికపాటి ప్రసంగిస్తున్నారు. ఈ పరిణామంతో కాస్త ఆగ్రహానికి లోనైన ఆయన ‘అటువైపు జరుగుతున్న ఫోటో సెషన్ ని ఆపేయాలి, లేకపోతే నేను వెళ్లిపోతా’ అని అన్నారు. ‘చిరంజీవి, దయచేసి అక్కడ మీరు ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపుకి రండి, నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను’ అని చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి సెల్ఫీలు ఆపేసి.. గరికపాటికి తన వల్ల కలిగిన అంతరాయానికి క్షమాపణ చెప్పారు.
అలయ్ బలయ్ కార్యక్రమం ఇతివృత్తంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా తీయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ కోరారు. బండారు దత్తాత్రేయ 2005లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా విజయ దశమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి.