మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’.. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. ఈ తరుణంలో ఈ మూవీ టీమ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకుల మాటలు విందామని అన్నారు. ప్రేక్షకుల ఉత్సాహమే మన ఇంధనం అని చెప్పారు.
సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని తెలిపారు చిరు. ఈ సినిమా నా బాధ్యత అనుకుని పని చేశానన్నారు. నిర్మాతల డబ్బును వృథా చేయకుండా దర్మకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్పుడే నిర్మాతలు బావుంటారు.. దానివల్ల పరిశ్రమ బావుంటుందన్నారు.
అలాగే వాల్తేరు వీరయ్య మూవీ విజయం అందరి సమిష్టి కృషి అని ఆయన చెప్పుకొచ్చారు. కష్టం నాది.. రవితేజది కాదు. వాల్తేరు వీరయ్య సినిమా కోసం పని చేసిన కార్మికులదన్నారు. మన మీద జాలితో కాదు.. సినిమాపై ప్రేమతో, కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి అని పేర్కొన్నారు. విజయాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కార్మికుల కష్టం అందరికీ తెలియాలన్నారు.
కాగా ఈ కార్యక్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాకు పని చేసిన కార్మికుల కోసం మేకర్స్ ఓ ప్రత్యేక వీడియో తయారీ చేశారు. ఆ వీడియోని చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించారు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్రని పోషించారు.