గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ మరణవార్త ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ కూడా చాలా మంది పునీత్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ మార్చి 17న అతని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మార్చి 6న కర్ణాటకలోని హోస్పేట్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి ప్రత్యేక అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ లు హాజరుకానున్నారట.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్‌కి పునీత్‌తో మంచి సంబంధాలు ఉండేవి. పునీత్ మృతి చెందినప్పుడు కూడా ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్లారు. అలాగే మెగా ఫ్యామిలీతో కూడా పునీత్ సన్నిహితంగా ఉండేవారు.
ఇక జేమ్స్ చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, ప్రియా ఆనంద్, శ్రీకాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే కర్ణాటకలోని ఎగ్జిబిటర్లు కన్నడనాట ఒక వారం పాటు జేమ్స్ మినహా మరే చిత్రాలను ప్రదర్శించకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కిషోర్ పత్తికొండ నిర్మించిన ఈ సినిమాను హిందీతో పాటు అన్ని దక్షిణ భారతీయ భాషలలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.