రాజమౌళి బాహుబలి తీసివుండకపోతే.. ఇవాళ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ తెరకెక్కేదే కాదు.. తనే సైరాకి స్పూర్తి… అన్నారు మెగాస్టార్ చిరంజీవి. సైరా ప్రి రిలీజ్ వేడుకలో మెగాస్టార్ దర్శక ధీరుణ్ణి ఆకాశానికి ఎత్తేశారు.
ఒక గొప్ప యోధుడు, తెరమరుగైన హీరో, అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే సైరా మూవీ తీశామని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. భగత్‌సింగ్ పాత్ర చేయాలనేది నా అభిలాష. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరినట్టుగా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు. ‘రాయలసీమలో రెండు మూడు జిల్లాల వాళ్లకు తప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. చిన్న చిన్న పుస్తకాలు, బుర్రకథలు, ఒగ్గు కథలు ఉన్నాయి తప్ప ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కానీ, కథ విన్న తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగల్‌పాండే గురించి తెలుసు. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి తెలుసు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ ఇలా ఎంతో మంది త్యాగమూర్తుల గురించి తెలుసుకున్నాం. కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి స్టోరీ తెరమరుగు అయిపోకూడదు. ఈయన మన తెలుగు వ్యక్తి, ఈయన గురించి ప్రపంచానికి చెప్పాలి అని మైండ్‌లో బలంగా ఉండిపోయింది. ఈ సినిమా చేయాలని పరుచూరి బ్రదర్స్ గట్టిగా సంకల్పించారో, నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారో.. యస్ చేయాలి అని నాలో కూడా బలమైన కోరిక ఏర్పడిపోయింది. దీనికోసమే కదా ఇన్నేళ్లుగా వేచిచూస్తున్నాను అనిపించింది.’ అని చిరంజీవి అన్నారు.
‘ఈ కథను తెరకెక్కించాలంటే మా ముందు ఉన్న పెద్ద సవాల్ బడ్జెట్. పది పదిహేనేళ్ల క్రితం నా మీద రూ.30 నుంచి రూ.40 కోట్లు వెచ్చించి సినిమా తీసే రోజుల్లో ఇది రూ.60, రూ.70 కోట్ల పైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు. మనం చేయమని అడగలేం. నష్టపోయే పరిస్థితి. ఏం చేయాలి? చూద్దాం చేద్దాం అంటూనే కాలం గడిచిపోయింది. ఈరోజున మళ్లీ 151వ సినిమాగా ఈ కథ తీస్తే ఎలా ఉంటుంది అనే మా ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన గనుక ‘బాహుబలి’ తీసుండకపోతే ఈరోజున ఈ ‘సైరా నరసింహారెడ్డి’ వచ్చి ఉండేది కాదు. మన తెలుగు సినిమాకి ఆయన ఒకదారిని నిర్మించేశారు. మనం ఖర్చుపెట్టినా సరే అంతకంత రాబట్టుకోవచ్చు, నిర్మాతకు నష్టం ఉండదు అని ఒకరకమైన భరోసా ఇచ్చిన వ్యక్తి రాజమౌళి. ఈ విషయం సభాముఖంగా చెప్పాలనే ఇంతకాలం ఆయనకు చెప్పలేదు. కానీ, ఇప్పుడు చెబుతున్నాను.. హ్యాట్సాఫ్ టు రాజమౌళి’’ అని చిరంజీవి మాట్లాడారు