సైరా నిజంగానే అంత పెద్ద సినిమానా? ఇప్పుడు ఇదే ప్రశ్న మీద మెగాభిమానుల మధ్య పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఎన్టీఆర్, ఎఎన్నార్ కాలంలో సినిమా అంటే దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల సేపు ఉండేది. మెల్లగా సినిమా నిడివి తగ్గుతూ వచ్చి రెండున్నర గంటలు, ఆ పై రెండు గంటలు, చివరికి ఒక గంట నలభై ఐదు నిమిషాలకు దిగజారుతూ వచ్చింది. సినిమాలో చెప్పడానికి, ప్రేక్షకులను కట్టిపడేయడానికి ఏమీ లేనప్పుడు మూడు గంటల సేపు ఎందుకో అనవసరంగా లాగడం అనే ఉద్దేశ్యంతోనే ఇలా జరుగుతూ వచ్చింది. అయినా సరే ఇలాంటి రోజుల్లో కూడా తమ కథల మీద, హీరోల మీదా నమ్మకమున్న దర్శకులు ఎంతసేపు సినిమా సాగినా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మి లాగిలాడి ప్రూవ్ చేసుకున్నారు కూడా.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ బాహుబలి రెండు భాగాలు. తర్వాత రంగస్థలం, శ్రీమంతుడు, భరత్ అనే నేను వగైరా వగైరా మూవీలు. నిడివి ఎక్కువైనా సరే ఆదరణకు నోచుకుని అవన్నీ సక్సెస్ సాధించాయి. ఎంత పెద్ద దర్శకుడైనా, హీరో అయినా, కథలో దమ్ము లేకపోతే ఇంత లాగ్స్ వుంటే తేడా కొట్టేస్తుంది. ఆ సత్యాన్ని గూబ మీద కొట్టి మరీ జవాబిచ్చిన సినిమా అజ్ణాతవాసి. అలాగే ఇక తాజాగా వచ్చిన ప్రభాస్ సాహో అయితే ముఖం మీద కొట్టి మరీ చెప్పిందీ సంగతి.
భారీ బడ్జెట్ అని చెబుతూ బొక్కబోర్లా పడిపోయిన పొడవైన తెలుగు సినిమా సాహోకి ప్రభాస్, శ్రద్ధాకపూర్, జాకీష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేశ్ వంటి చాంతాడంత భారీ స్టార్స్ లిస్ట్ ఉన్నా సరే, మంచి కథ లేకపోవడంతో కష్టాలపాలైంది. ఇప్పుడు ఇదే సీన్ రిపీటవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న 152వ సినిమా “సైరా” నిర్మాణాన్నిపూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ వెచ్చించి తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగాస్టార్ తనయుడు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నఈ సినిమా నిడివి మొత్తానికి 165 నిమిషాలుగా ఫ్రీజ్ చేశారట. అంటే సైరా సినిమా బడ్జెట్ పరంగా చూస్తే సినిమాలో ప్రతి నిమిషం ధర దాదాపుగా ఒకటిన్నర కోట్లకు పైమాటే. సాహోలా సైరా కూడా అభిమానులను, ప్రేక్షకులను నిరాశ పరుస్తుందా లేక విజయవంతమవుతుందా తేలడానికి మరో నెల ఆగాల్సిందే.