కథపై అపారమైన నమ్మకం ఉన్నప్పుడు ఒక్కోసారి హీరోలు, హీరోయిన్లు నిర్మాతలుగా మారిన సందర్భాలు పరిశ్రమలో చాలా ఉన్నాయి. డబ్బులు వస్తాయా పోతాయా అనే విషయాన్ని పక్కనపెడితే, అలాంటి సినిమాల్ని వాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఓ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది హీరోయిన్ మేఘా ఆకాష్.
కాస్త వెయిట్ ఉండే పాత్రలు పోషిస్తున్న ఈ ముద్దుగుమ్మ వద్దకు రీసెంట్ గా ఓ కథ వచ్చింది. ఆ కథ ఎంత బాగుందంటే, దాదాపు వారం రోజుల పాటు మేఘ ఆకాశ్ మనసంతా ఆ కథ చుట్టూనే తిరిగిందట. దీంతో వెంటనే ఆ సినిమా చేసేయాలని ఆమె నిర్ణయించుకుంది. దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.
కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకొచ్చే నిర్మాత ఎవ్వరూ లేరు. దర్శకుడి దగ్గర నిర్మాత లేడు, హీరోయిన్ దగ్గర అడ్వాన్సులు లేవు. దీంతో ఈ కథను తనే నిర్మించాలని డిసైడ్ అయింది మేఘా ఆకాష్. ఈ మేరకు తన తల్లి బిందు ఆకాష్ ను నిర్మాతగా మార్చేసింది. అలా బిందు ఆకాష్ సమర్పణలో మేఘా ఆకాష్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.
రీసెంట్ గా డియర్ మేఘ అనే సినిమా చేసింది మేఘ ఆకాష్. ఈ సినిమాను తెరకెక్కించిన సుశాంత్ రెడ్డి, ఓ వినూత్నమైన ప్రేమకథ రాసుకున్నాడు. ఆ స్టోరీకే మేఘా ఆకాష్ తాజాగా ఓకే చెప్పింది. అయితే ఈ కథపై పూర్తి హక్కులు సుశాంత్ రెడ్డివి కావు. ఆయన తన అసోసియేట్ అభిమన్యుతో కలిసి ఈ కథ తయారుచేశాడు. అందుకే అభిమన్యునే ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.