– కోర్టు స్టేలన్నా పట్టింపు లేదు.. రూల్స్ అంటే లెక్కలేదు!
– ఎన్జీటీ వద్దన్నా పనులు.. ఐదుగురి ప్రాణాలు బలి!
– నీళ్ల పేరుతో నిధుల దోపిడీ
– ఎన్ని ప్రమాదాలు జరిగినా చర్యలేవి?
– మేఘాతో నష్టాలే గాని.. లాభాలేవి?
క్రైంబ్యూరో, తొలివెలుగు:ప్రాజెక్ట్ ఏదైనా పనులు అడ్డగోలుగా నడిపడం మేఘాకు అలవాటైపోయింది. ఎంత మందిని పొట్టన పెట్టుకున్నా ధనదాహమే తప్ప.. కోర్టు ఆదేశాలు సైతం పట్టవు ఆ సంస్థకు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఈమధ్య జరిగిన ప్రమాదమే అందుకు నిదర్శనం. కల్వకుర్తి పంప్ హౌజ్ ల నిర్మాణంపై నిఫుణులు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసింది. రూల్స్ కు విరుద్ధంగా అండర్ టన్నెల్ లో బ్లాస్టింగ్ చేయడం వలన ఎల్లూరు పంపు హౌస్ లు నీట మునిగి పోయాయి.
పర్యావరణ అనుమతులు లేకుండానే చేస్తున్న పనులపై ఏపీ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. దీంతో పాటు పాలమూరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అప్పటికే కేసు వేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్జీటీ చెన్నై బెంచ్ స్టే ఆర్డర్ ఇచ్చింది కూడా. కానీ పనులు మాత్రం అపడం లేదు మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పైగా తాము పనులే చేయడం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు తీర్పులు తనను ఏం చేయలేవనే ధీమాతో విర్రవీగిపోతూ కార్మికుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని టన్నెల్ లో అప్పట్లో 15 మంది చనిపోతే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చట్టానికి, రూల్స్ కు విరుద్ధంగా పనులు చేపడుతుండటం నిఫుణులను కలవరపెడుతోంది.
మూడో టీఎంసీపై సుప్రీం స్టే.. కానీ ఇంకా?
కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ ఎత్తిపోయొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే స్టే ఇచ్చింది. కానీ.. తమదే రాజ్యం అంటూ ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు, ప్లానింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే చేసిన నష్టం సరిపోదన్నట్లు.. మరో రూ.10 వేల కోట్లను గోదావరిలో పోసేందుకు సిద్ధమౌతున్నారు. కోర్టులను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న ఈ మోనార్క్ ఇజానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని ఎదురుచూస్తున్నారు నీటి రంగ నిఫుణులు.