దేశంలో కార్పొరేట్ శక్తులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు. ఇందులో అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేదు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో, రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తూ తాను అనుకున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం వీరి పని. తమ కంపెనీలు ఉన్న ప్రాంతంలో అయితే ప్రతిపక్ష నాయకులను కూడా తమవైపు తిప్పుకుంటారు. అందుకు సరైన ఉదాహారణ తెలంగాణ రాష్ట్రం.
ఇక్కడ అధికార టీఆరెఎస్ తో పాటు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు మై హోమ్ రామేశ్వర్ రావు, మెఘా కృష్ణా రెడ్డి గురించి మాట్లాడాలంటే భయపడతారు. ఇది పక్కా క్విడ్ ప్రో కో. ఎన్నికలు రాగానే ఈ ఇద్దరు బడా కాంట్రాక్టర్లు టీఆరెఎస్ , కాంగ్రెస్ నాయకులకు ఫండింగ్ చేస్తారన్నది రాజకీయ వర్గాల అనధికారిక సమాచారం. మరి తమ గెలుపుకు కారణమైన, తమకు ఏదో ఒక రూపంగా ఉపయోగపడే ప్రతిపక్ష నాయకులకు వీళ్ళని విమర్శించే ధైర్యం ఎలా వస్తుంది. వచ్చే అవకాశమే లేదు. అందుకే సైలెంట్‌గా ఉండటమో.. లేదా అంటీ ముట్టనట్లుగా మాట్లాడటమో చేస్తుంటారు. కానీ ఎక్కడా… నేరుగా ఆ వ్యక్తులు, వారి అరాచకాలు… వారి అవినీతిపై నోరు మెదపరు.
ఒక్కసారి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూద్దాం. మైహోం, మెఘాను బాహాటంగా విమర్శించే నాయకులు రేవంత్ రెడ్డి వైపు కనిపిస్తారు, అసలు వారి ఊసెత్తని నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు కనిపిస్తున్నారు. మరికొందరు మనకెందుకు గొడవ అని సైలెంట్ గా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు. అందరూ కెసిఆర్ ని తిట్టే వాళ్ళే కానీ, రాష్ట్రంలో దోపిడీకి కారణమవుతున్న ఈ శక్తుల గురించి మాత్రం మాట్లాడరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అంటారు కానీ అందులో మెజారిటీ భాగమైన మెఘా కంపెనీ గురించి నోరు విప్పరు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంచనాలు పెంచి, అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తారు. కానీ అవి ఎవరికి ఇచ్చారో మాత్రం చెప్పరు. మీడియా మొత్తం కెసిఆర్ గుప్పిట్లో ఉంచుకున్నారు అని విమర్శిస్తారు. కానీ అందుకు కారణమైన మై హోమ్ పెరెత్తడానికి భయపడతారు కాంగ్రెస్ నాయకులు.
ఏకంగా పిసిసి చీఫ్ పైనే మై హోమ్ తో సంబంధాల గురించి ఆరోపణలు రావడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం హూజుర్ నగర్ లో మై హోమ్ సిమెంట్ కంపెనీలు ఉండడం. మై హోమ్ కి తనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యే అక్కడ అవసరం. దానికి ఎవరైనా మై హోమ్ గూటి పక్షులే అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇక గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ ను సపోర్ట్ చేసే వారు సహజంగానే మై హోమ్ గురించి మాట్లాడరు. మాట్లాడితే ఉత్తమ్ కు కోపమొస్తుంది అని ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సిఎల్పీ లీడర్ కూడా కాంట్రాక్టులు ఇచ్చిన ప్రభుత్వాన్ని తప్పుబట్టాలి కానీ కాంట్రాక్టర్ ల పాత్ర ఏముంటుందని తొలి వెలుగు ఇంటర్వ్యూలో చెప్పేశారు.
ఇక టీవీ డిస్కషన్స్ కి వెళ్ళే నాయకుల పరిస్థితి ఇంకోలా ఉంది . మై హోమ్ గురించి మాట్లాడితే, ఆయన గుప్పిట్లో ఉన్న ఛానెల్ కి నో ఎంట్రీ అన్నారట. ప్రముఖ ఛానెల్‌లో మై హోమ్ మనిషిగా ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి కాంగ్రెస్ నాయకులకు సూటిగా ఇదే అంశాన్ని చెప్పేశాడట. దీంతో మరికొందరు కాంగ్రెస్ నాయకులు సైలెంట్ అయ్యారు.
ఇక రేవంత్ వర్గం ముందు నుండి ఈ అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. రేవంత్ గ్రూప్ లో ఉన్న నాయకులు బాహాటంగానే మై హోమ్ , మేఘా ను టార్గెట్ చేస్తున్నారు.
ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మై హోమ్ ,మేఘను విమర్శించే నాయకులు, వెనకేసుకొచే నాయకులు గా చీలిపోయారు.
ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడాల్సిన నేతలు… ఇలా అనధికారికంగా అధికార పార్టీకి అండదండలు అందించే పెత్తందారుల చేతుల్లోకి వెళ్లిపోతే ప్రజలు ఎలా నమ్ముతారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.