రెండు రాష్ట్రాలు నావే… నేను చెప్పిందే వేదం… నేను నో అంటే అన్నీ ఆగిపోవాల్సిందే… ఇలా విర్రవీగిపోయిన ఎందరో ఇప్పుడు కాలగర్భంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో గ్రాండ్‌గా మెఘా కృష్ణారెడ్డి సామ్రాజ్యం కూడా చేరిపోనుందా… రెండ్రోజుల నుండి మెఘా ఒంటరైపోయారా…
నిజమే… ఇటు కేసీఆర్ ప్రభుత్వంలోనూ, అటు జగన్ ప్రభుత్వంలోనూ మెఘా ఎంత చెప్తే అంత. ఓ సంస్థను కానీ వ్యక్తిని కానీ నిలబెట్టాలనుకుంటే నిలబెట్టుకోవచ్చు, అణిచివేయాలంటే అణిచివేయొచ్చు. అవతల ఎంత పెద్దవారున్నా సరే… చిటికెలో పనైపోతుంది. అలాంటి వారు పాపం పండకపోతుందా అనుకునే లోపే… మెఘాకు కోలుకోని దెబ్బలు తగిలేలా ఉన్నాయి. గతం ఎంతో ఘనం అనుకునే చరిత్రలా మెఘా కుదేలవనుంది.
మెఘా కృష్ణారెడ్డి చిటికెస్తే… మంత్రులు, ఎమ్మెల్యేలు వాలిపోయేవారు. ఆఫీసర్లకయితే లెక్కేలేదు. కానీ రెండ్రోజులగా ఐటీ శాఖ చేస్తోన్న దాడులు… మెఘాను ఒంటరి చేశాయి. గురువారం అర్ధరాత్రి తరువాత నుండి ఇప్పటికీ మెఘా ఒక్కరే ఇంటి గడప దాటలేదు. ఒంటరిగా అధికారుల ప్రశ్నలకు జవాబులు చెప్తూ… కూర్చుండిపోయారు. ఏ ఆఫీసులో, ఎక్కడ ఏ డాక్యుమెంట్లు దొరుకుతున్నాయో తెలియదు… లోపల అదో భయం. ఇలా బిక్కు బిక్కుమంటూ సాగుతోంది ఒంటరిగా. కనీసం ఎవరికైనా ఫోన్ చేయడానికి కూడా తన ఫోన్ తన అందుబాటులో లేదు. దేశంలోనే అత్యంత శర వేగంగా విస్తరిస్తోన్న పారిశ్రామికవేత్తను. నాకు ఎదురులేదనుకొని ఉండొచ్చు… కానీ ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. కానీ తప్పలేదు…
అయితే, డిల్లీ టీంల పర్యవేక్షణలో మొత్తం ఆపరేషన్ నడుస్తోంది. తనను ఇబ్బందిపెట్టి, జైలు పాలుచేసి, వెన్నుపోటు పొడిచిన మెఘా దాడులపై రవిప్రకాశ్ ఉన్నారని మెఘా వర్గాలు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలోనూ, పాలకపక్షంలోనూ మనకు ఎదురు వచ్చే వారే లేరు. కానీ రవిప్రకాశ్ అరెస్ట్ అయి నాలుగు రోజులు గడిచేలోపే ఇంతపెద్ద ఎదురుదెబ్బ తగిలిందని మదనపడుతున్నట్లు తెలుస్తోంది.
కానీ, ఈ దాడులు ఇంతటితో ఆగేలా కనపడటం లేదు. ఇప్పటికే… బ్యాంకుల లావాదేవీలు, బిల్లులు… క్యాష్ రిసిప్టులు సహా పలు హావాలా లావాదేవీల సమచారం దొరికనట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఓవైపు ఐటీ దాడులు కొనసాగుతుండగానే… మరోవైపు హార్డ్ డిస్క్‌ల్లో ఉన్న సమాచార విశ్లేషణ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే… ఐటీ ఇప్పటికే ఈడీకి సమాచారం అందించిందని, త్వరలో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ లావాదేవీల అంశంపై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం కనపడుతోంది.
ఐటీ దాడులు మరో రెండు రోజులు సాగే అవకాశం ఉందని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.