– ఎన్నారై మెడికల్ కాలేజీ కబ్జా నిజమే?
– డైరెక్టర్స్ ని కొనుగోలు చేసి కబ్జా పెట్టే ప్రయత్నం?
– నిధుల దుర్వినియోగంపైనా ఆరోపణలు
– బ్లాక్ మనీ కోసమే మెడికల్ కాలేజీ?
– ‘‘మెగా మెడి‘కిల్’ మాఫియా’’ పేరుతో తొలివెలుగు కథనాలు
– మూడు నెలల క్రితమే చెప్పిన తొలివెలుగు
– కొత్త అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా రిటైర్డ్ ఐపీఎస్
– జస్టిస్ దేవేంద్ర గుప్త ఆదేశాలతో నియామకం
– వచ్చే నెలలో గుట్టంతా బయటకు!
– మెగా కృష్ణారెడ్డిలో మొదలైన వణుకు!
క్రైంబ్యూరో, తొలివెలుగు:అమరావతికి కూతవేటు దూరం.. బాగా పేరుమోసిన వైద్య విద్యాలయం. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు శ్రీరామరక్ష. ఎందరో విద్యార్థులను డాక్టర్లను చేస్తున్న స్థలం. అలాంటి ప్రదేశంపై మెగా కృష్ణారెడ్డి కన్ను పడింది. ఈ విషయాన్ని తొలివెలుగు క్రైంబ్యూరో ముందే బట్టబయలు చేసింది. మూడు నెలల క్రితమే చినకాకాని దగ్గర ఎన్నారై కాలేజీ కబ్జా బాగోతాన్ని కళ్లకు కట్టినట్లు కథనాలు ఇచ్చింది. అయితే.. ఈ వ్యవహారం ఇంకొన్ని రోజుల్లో ఓ కొలిక్కి వచ్చేటట్టు కనిపిస్తోంది.
ఫిబ్రవరి 12 తొలివెలుగు కథనాల తర్వాత 18మంది డైరెక్టర్లు కాదని కేవలం 12 మంది ఉన్న డైరెక్టర్లే ఆధిపత్యం కొనసాగిస్తూ నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున నగదు రూపంలో బ్లాక్ మనీని వివిధ పార్టీలకు సమకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 18 మంది డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు కాలేజీలో జరిగిన వ్యవహారాలను, సమస్యలను అన్నీ విచారించేందుకు రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర గుప్తని మధ్యవర్తిగా, జ్యుడీషియల్ అధికారాలతో నియమించింది. తర్వాత ఆయన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికిప్పుడు కొత్త అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అవసరం ఉందని.. ఫండ్స్ మిస్ యూస్ అవుతున్నాయని.. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సరిగ్గా లేదని.. వీటన్నింటినీ సరిదిద్దేందుకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రావును నియమించారు.
ఇప్పటికే 30 మంది డైరెక్టర్లను విచారించిన జస్టిస్ దేవేంద్ర గుప్త.. కాలేజీలో జరిగిన అవకతవకలు, అకౌంట్స్, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని మధ్యవర్తిగా ఆఫీసర్.. సమస్యలను పరిష్కారం చూపుతారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరిగిన తర్వాత వచ్చే నెలలో తుది తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మెగా కృష్ణారెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు చెంపపెట్టులా తయారయ్యాయి. డబ్బుంటే ఏదైనా కొనుగోలు చేయవచ్చు అని తాను నమ్మిన సిద్ధాంతానికి మధ్యంతర ఉత్తర్వులు తగిన గుణపాఠం చెప్పాయని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇందులో డబ్బుల వ్యవహారంపైన వివిధ దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టినట్లు సమాచారం. కాలేజీ నిర్వహణ పాత కమిటీనే తీసుకుని పూర్వవైభవం తీసుకురావాలని మెజార్టీ విద్యార్థులు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ తీర్పు ఎన్నారై మెడికల్ కాలేజీ కబ్జాను అడ్డుకుందని అనుకుంటున్నారు. పోలీస్ బలగాల మోహరింపు చేసి అక్రమంగా కేసులు బనాయించి కాలేజీ కబ్జా చేసిన వ్యవహారం తొలివెలుగు.. వెలుగులోకి తీసుకురావడంతో మిగతా డైరెక్టర్లకు భరోసా కలిగినట్లయింది. ఆ తర్వాతనే కోర్టుకు వెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడంతో మెజార్టీ ఉన్న డైరెక్టర్ల చేతికే నిర్వహణ వెళ్లనున్నట్లుగా చర్చ జరుగుతోంది.