మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో మెఘా అవినీతి చిట్టా దొరికిందా…? ఐటీ అధికారులు ఇప్పుడదే కూపీ లాగుతోన్నారా…? రెండ్రోజులగా సోదాలు సాగుతోన్న… ఇవ్వాళే మెఘా ఇంటిని కేంద్రబలగాలు తమకు గుప్పిట్లోకి ఎందుకు తీసుకున్నారు…? మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో అసలేం జరుగుతోంది…?
మెఘా ఇంజనీరింగ్ సంస్థ అధినేత మెఘా కృష్ణారెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై ఇంకా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 40గంటలకు పైగా సోదాలు నడుస్తూనే ఉన్నా… ఇంకా లెక్క తేలటం లేదు. అధికారులు విడతల వారిగా, అనుమానం ఉన్న ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఐటీ సంస్థల దాడులతో పాటు.. మెఘా కృష్ణారెడ్డి ఇంటి దగ్గర భారీగా కేంద్రబలగాలు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
మాములుగా అయితే… ఐటీ సోదాల సమయంలో స్థానిక పోలీసుల సహాయం తీసుకుంటూ ఉంటారు. కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అంటే లోకల్ పోలీసులతో పాటు… కేంద్రబలగాల రక్షణ ఉంటుంది. కానీ… మెఘా ఇంటి వద్ద మాత్రం నిన్నటి కన్నా ఎక్కువగా కేంద్ర బలగాలను భారీగా మోహారించారు. అసలు స్థానిక పోలీసుల సహాయం కోరకుండా… ఐటీ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు కనపడుతోంది. పక్కా వ్యూహంతో, పక్కా సమాచారంతోనే ఐటీ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, స్థానిక ప్రభుత్వం మెఘాకు అత్యంత సన్నిహితంగా ఉంటుందన్న పక్కా సమాచారంతోనే ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లోకల్ పోలీస్ సహాయం కోరలేదని, కేంద్రం నుండి… ఇతర నిఘా ఏజెన్సీల నుండి ఈమేరకు ఐటీ పూర్తిగా కేంద్ర బలగాలనే వాడుకుంటున్నట్లు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెఘా ఇంట్లో ఏం జరుగుతుందో సమాచారం బయటకు వెళ్లకుండా కేంద్ర సంస్థలు జాగ్రత్తపడుతుండటం చూస్తుంటే… మెఘా పని ఇంక అంతే, కేంద్రం దృష్టి మెఘాపై పడినట్లు కనపడుతోందని అంటున్నారు.