- ఫస్ట్ వచ్చినా.. కానరాని స్పష్టత
- స్పెషల్ ఆఫీసర్ కి సహకరించని బ్యాంకర్లు
- కొత్త లెక్కలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే..
- కరోనా లెక్కలంటూ అక్రమకేసుల బనాయింపు
- హాట్ టాపిక్ గా డైరెక్టర్ సుబ్బయ్య వ్యవహారం?
ప్రజల ప్రాణాలు కాపాడే ప్రముఖ ఆసుపత్రికి సంబంధించిన విషయాలు ఏవైనా సరే.. తెలుసుకునేందుకు ప్రజలు సహజంగానే ఆసక్తి చూపిస్తారు. అలాంటి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో జరిగే వ్యవహారాలపై తొలివెలుగు ఎప్పటికప్పుడు వరుస కథనాలు ప్రజల ముందు ఉంచుతోంది. ప్రభుత్వాలకు ప్రజా వ్యవస్థలకు కరెప్షన్ కింగ్ లా మారాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నమెగా కృష్ణారెడ్డి గుంటూరులోని ఎన్నారై కాలేజీని కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ యవ్వారంపై తొలివెలుగు క్రైం బ్యూరో ఆధారాలతో సహా ఒక్క ఎన్నారై కాలేజీ కబ్జాపైనే 8 కథనాలు అందించింది. అంటే ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని దారుణాలకు ఒడిగడుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
జీతాలు ఇవ్వకుండా కుట్రలు
ఎన్నిఅవాంతరాలు ఎదురైనా ఎన్నారై సిబ్బందికి జీతాలు ఆలస్యం కాలేదు. పుష్కళమైన నిధులతో పాటు..ఉద్యోగుల బాగోగులు అలానే చూసుకునే మేనేజ్మెంట్ ఉండేది. కాని మేఘా కబ్జా తర్వాత .. సీన్ రివర్స్ అయింది. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు ఉద్యోగులు. అయితే ఈ సారి 10వ తేది వచ్చినా..స్పెషల్ ఆఫీసర్ జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరని తెలుసింది. ఇందుకు కారణం ఆ రిటైర్డ్ డీజీ నిక్కచ్చి తత్వం పడలేకనే అంటున్నారు. అటు..బ్యాంకర్లను సహకరించ వద్దని మేఘా సంస్థ ప్రతినిధులు ఎన్.ఆర్.ఐ. కాలేజీలో డైరెక్టర్లుగా చొరబడి ఒత్తిళ్లు చేస్తున్నారు. అందుకే ఈసారి జీతం ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు వాపోతున్నారు.
ఆర్బిట్రేటర్ ట్రిబ్యునల్ తీర్పుపై పట్టింపులేదు
ఆర్బిట్రేటర్ తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్లిన 11 మంది డైరెక్టర్స్ ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ కి ఏమీ తెలియదని చెప్పడానికి ఈ జీతాల వ్యవహారాన్ని తీసుకొస్తున్నారు. ఆవులు ఆవులు పోట్లాడుకుంటే.. లేగ దూడల కాళ్లు విరిగినట్లు ఉద్యోగుల జీతాల పై ప్రభావం చూపేలా చేసే విధానాన్ని18 మంది డైరెక్టర్స్ తప్పు పడుతున్నారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చేలా తీర్పును రద్దు చేయాలని, స్పెషల్ అధికారిని తొలగించేలా.. ఉద్యోగులతోనే పిటిషన్ వేసేలా స్కెచ్ లు వేసుకుంటున్నారు.
సుబ్బయ్యా.. ఇదేంటయ్యా..?
పోలవరం ప్రాజెక్ట్ కోసమే అంటూ నియమించుకున్నరిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ సుబ్బయ్య..మేఘా కృష్ణారెడ్డికి అత్యంత దగ్గర అయ్యారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయాలతో లాబీయింగ్ కోసం సదరు వ్యక్తిని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే తాను పరిధి దాటి వ్యవహరించటమే.. ఎన్నోకేసుల్లో మేఘా సంస్థ బజారున పడటానికి కారణమని ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. తన కూతురు,అల్లుడు ఇద్దరూ డాక్టర్స్ కావడం,ఎన్.ఆర్.ఐ. కాలేజీ అతని చేతిలోకి పూర్తిగా తీసుకోవాలనే దురుద్దేశం పెరగడమే ఈ రాద్దాంతానికి దారి తీస్తోందని విమర్శిస్తున్నారు ఉద్యోగులు.
కేసుల వెనక లొంగతీసుకునే ప్రయత్నమేనా..!
ఎన్నారై మెడికల్ కాలేజీలో కరోనా సమయంలో అక్రమంగా డబ్బులు వసూలు చేశారని కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ ఒక్క ఆస్పత్రి మాత్రమే కాదు. అనేక ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. కాని వాటన్నింటి పై ఇంకా ఛార్జిషీట్స్ వేయలేదు. కాని ఎన్నారై కాలేజీలోని డైరెక్టర్స్ ని అరెస్ట్ చేయడం అన్యాయమని డైరెక్టర్స్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే కొంత మంది 2000 వేల కోట్ల కాలేజీని 200 కోట్లకు దిగమింగే కుట్రలో భాగమే అక్రమ కేసులంటూ డైరెక్టర్స్ వాపోతున్నారు.