మేఘాలయ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫాగు చౌహాన్ ముఖ్యమంత్రి సంగ్మాతో పాటు 12 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. రాజధాని షిల్లాంగ్ లోని రాజ్ భవన్ లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది.
మేఘాలయలో మొత్తం 60 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్‌పీపీ 26 స్థానాలను గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 5 సీట్లతో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ కు 5 సీట్లు వచ్చాయి.
అటు బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి నాలుగు సీట్లు దక్కాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
కాగా నాగాలాండ్ ముఖ్యమంత్రి ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు నెప్యూ రియో. ఆయనతో పాటు పలువురు మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు గవర్నర్ లా గణేశన్. టీఆర్ జెలియాంగ్, వై పట్టోస్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
సోషల్ మీడియాలో పాపులర్ అయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెమ్జెన్ ఇమ్నాతో పాటు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరు మహిళల్లో ఒకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని కొహిమాలో జరిగిన ఈ కార్యాక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.